పింప్రి, న్యూస్‌లైన్: మోడీ పదేపదే చెబుతున్న గుజరాత్ అభివృద్ధి కన్నా మహారాష్ట్రనే అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వజిత్ కదమ్‌కు మద్దతుగా నగరంలోని ఎస్‌ఎస్‌పీఎంఎస్ మైదానంలో మంగళవారం ఉదయం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ...బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి పాలనలోని మహారాష్ట్రనే అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని తెలిపారు.
దీనిపై బీజేపీ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజల సమస్యల నుంచి రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టోను బీజేపీ దొంగిలించిందని మండిపడ్డారు. ‘గుజరాత్‌లో పేదరికం ఉంది. ప్రతి ఇద్దరిలో ఒకరు పస్తులు ఉంటున్నారు. మహిళలు, కూలీలు కష్టపడుతున్నారు. వారి బాగోగుల గురించి మోడీ ఏనాడూ పట్టించుకోలేద’న్నారు. అక్కడి పరిస్థితిని గురించి ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. గుజరాత్‌లో 40 శాతం మంది పేదలున్నారని, కనీసం వారికి మంచినీటి అవసరాలు తీర్చలేని మోడీ దేశాన్ని ఉద్ధరిస్తారంటే నమ్మేవాళ్లు లేరన్నారు. పుణే దేశంలోనే మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ అని, ఇకపై వస్తువులపై ‘మేడిన్ ఇండియా’ ఉండదని, మేడిన్ పుణే, బెంగళూరు, ముంబై అని ఉంటుందని తెలిపారు.
దీనివల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. గడిచిన పదేళ్లుగా నిరుద్యోగాన్ని దూరం చేయడంతో పాటు 15 కోట్ల మందిని పేదరికం నుంచి దూరం చేశామన్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మోహన్ ప్రకాశ్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అభయ్ ఛాజెడ్, ఎన్సీపీ నగర అధ్యక్షుడు వందనా చౌహాన్, కాంగ్రెస్ శాసన సభ్యులు మోహన్ జోషీ, వినాయక్ నిమ్హాన్, రమేష్ భాగవే తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.
గుజరాత్‌ను మించిన మహా ప్రగతి
Published Wed, Apr 16 2014 2:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement