పల్లెసీమలకు ఇక మంచి రోజులు
దత్తతలో మిగతావారికంటే ముందున్న ఢిల్లీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: పల్లెలను దత్తత తీసుకునే విషయంలో ఢిల్లీ ఎంపీలు మిగతావారికంటే ముందున్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సంసద్ ఆదర్శ్ గావ్ యోజనకింద తమ నియోజక వర్గాల పరిధిలోని ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు పార్లమెంటు సభ్యులకు తొలుతఇచ్చిన గడువు ముగిసింది. సగానికి పైగా ఎంపీలు ఇంకా గ్రామాలను ఎంపిక చేసుకోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఢిల్లీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఈ పథకం కింద గ్రామాలను దత్తత తీసుకున్నారు.
తూర్పు ఢిల్లీ ఎంపీ మహేష్‌గిరి తన నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించి మిగతావారికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచంలోని ఎన్నదగిన మహానగరాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఢిల్లీ పరిధిలోనే ఉన్నప్పటికీ అనేక సమస్యలతో సతమవుతున్న ఈ గ్రామాల్లో పురోగతిపై ఆశలు పెరిగిపోయాయి.
ఆదర్శ గ్రామం పథకం కింద చౌహన్‌పట్టీ, కాదీపుర్ గ్రామాలను దత్తత తీసుకున్నట్లు ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ ప్రకటించారు. న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షీ లేఖి ఐఎన్‌ఏ వద్దనున్న పిలంజీ గ్రామాన్ని, దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూడీ భాటీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తూర్పు ఢిల్లీ ఎంపీ మహేష్ గిరి మొత్తం 44 గ్రామాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించినప్పటికీ సంసద్ ఆదర్శ్ గావ్ యోజనకింద తొలుత గాజీపుర్ సమీపంలోని చిల్లా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు.
పశ్చిమ ఢిల్లీ ఎంపీ ప్రవేశ్ వర్మ నజఫ్‌గఢ్ శాసనసభ పరిధిలోని ఝాండోదా గ్రామంతో పాటు మటియాలా శాసనసభ పరిధిలోని దౌలత్‌పుర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. చాందినీచౌక్ ఎంపీ డా. హర్షవర్దన్ ధీర్‌పుర్ గ్రామాన్ని, వాయవ్య ఢిల్లీ ఎంపీ ఉదిత్‌రాజ్ జౌంతీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాలు విద్యుత్ కొరత, నీటి సరఫరా సమస్యలతో పాటు రహదారులు, పాఠశాలలు, మురుగుకాల్వలు వంటి మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నాయి.