సర్వం సిద్ధం
♦ నేడు రాష్ట్రపతి ఎన్నికలు
♦ ఢిల్లీకి ఎంపీలు
♦ చెన్నైకు ఎమ్మెల్యేలు
♦ కరుణ ఓటు వేసేనా
♦ ఎన్నికలకు పీఎంకే దూరం
♦ అన్నాడీఎంకే కార్యాలయం ముట్టడికి యత్నం
రాష్ట్రపతి ఎన్నికలకు అసెంబ్లీ ఆవరణలో సర్వం సిద్ధం చేశారు. ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సభ్యుల కోసం ఓటింగ్‌కు తగ్గ అన్ని వివరాలు, సూచనలతో బోర్డుల్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ ఢిల్లీ పయనమయ్యారు. ఎమ్మెల్యేలు అందరూ చెన్నైకు చేరుకుంటున్నారు.
సాక్షి, చెన్నై
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియనుండడంతో 14వ కొత్త రాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతి పక్షాల అభ్యర్థిగా మీరా కుమార్ ఆ పదవి కోసం పోటీ పడుతున్నా రు. ఇప్పటికే ఈ ఇద్దరు చెన్నైలో పర్యటించి రాజ కీయ పక్షాల ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతును సేకరించారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా జయలలిత మరణంతో ఓ స్థానం ఖా ళీగా ఉంది.
మిగిలిన సభ్యులు తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. డీఎంకే, కాంగ్రెస్, ఐయూఎంఎల్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఓటింగ్ ని మిత్తం చెన్నైకు ఆదివారమే చేరుకున్నారు. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ మద్దతు ఎ మ్మెల్యేలు ఒకరిద్దరు మినహా తక్కిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెన్నై చేరుకుంటున్నారు. ఇక, అన్నాడీఎంకేలో ఉన్న మనిదనేయ జననాయగ కట్చి ఎమ్మెల్యే తమీమున్ అన్సారి మాత్రం తన ఓటు మీరాకుమార్‌కు అని ప్రకటించడం గమనార్హం.
ఎంపీలందరూ ఢిల్లీలో:
ఇక, డీఎంకేకు చెందిన ఎంపీ కనిమొళి, తిరుచ్చిశివ, ఆర్‌ఎస్ భారతి, టీకేఎస్ ఇళంగోవన్, సీపీఎం రంగరాజన్, సీపీఐ డి.రాజా తమ ఓట్లను ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలోని పోలింగ్ కేంద్రంలో వినియోగించుకోనున్నారు. ఇక, అన్నాడీఎంకే చెందిన రాజ్యసభ, పార్లమెంట్ సభ్యులు అందరూ ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీళ్లంతా ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ముందుగా ఎంపీలతో సీఎం పళనిస్వామి భేటీ అయ్యారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం వెన్నంటి ఉన్న ఎంపీలను తమ వైపునకు తిప్పుకునే రీతిలో ఢిల్లీలో పావులు కదపాలని తమ శిబిరం ఎంపీలకు సూచించినట్టు సమాచారం.
ప్రత్యేక ఏర్పాట్లు:
ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎమ్మెల్యేలు సిద్ధం కావడంతో సచివాలయం ఆవరణలో అసెంబ్లీ సమావేశ మందిరం, పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. అసెంబ్లీ లాబీ ఆవరణలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. ఓటు హక్కు వినియోగించుకునే సభ్యులు ప్రవేశ మార్గంలో ఉన్న పుస్తకంలో సంతకంచేసినానంతరం లోనికి వెళ్లే రీతిలో ఏర్పాట్లు చేశారు. వారి వెంట ఎవర్నీ అనుమతించరు.
ఎన్నికల అధికార్లుగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ కార్యాదర్శి(ఇన్) భూపతి, సంయుక్త కార్యదర్శి సుబ్రమణియన్ సభ్యుల గుర్తింపు కార్డులు, ఇతర కార్డులను పరిశీలిస్తారు. తదుపరి ఓటింగ్ హాల్లోకి ఒక్కొక్కర్ని మాత్రమే అనుమతించనున్నారు. బ్యాలెట్ పేపర్, పెన్ను స్వయంగా ఎన్నికల వర్గాలు అందిస్తాయి. ఆ పెన్ను ద్వారా మాత్రమే ఎవరికి ఓటు అన్నది నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ బాక్సులు, పేపర్లు అన్ని సిద్ధం చేయడంతో పాటు, అక్కడక్కడ సభ్యులకు ఓటింగ్ నిబంధనలను సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో కేంద్ర ఎన్నికల పర్యవేక్షణాధికారి అన్సు ప్రకాష్, రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు, పేపర్లను స్ట్రాంగ్ రూముల నుంచి బయటకు తీస్తారు.
పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల దృష్ట్యా, సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టంచేయడంతోపాటు వాహనాలకు ఆంక్షలు విధించారు. ఇక, కేంద్ర సహాయ మంత్రి, కన్యాకుమారి ఎంపీ పొన్ రాధాకృష్ణన్ బీజేపీ అభ్యర్థికి ఏజెంట్‌గా వ్యవహరించనున్నారు. ఆయన తన ఓటును చెన్నైలో వినియోగించుకోనున్నారు. అలాగే, కేరళకు చెందిన అబ్దుల్ ఎమ్మెల్యే కూడా చెన్నైలో ఓటు వేయనున్నారు. అయితే, డీఎంకే అధినేత కరుణానిధి ఓటు వేయడానికి వచ్చేది అనుమానమే. ఆయన విశ్రాంతిలో ఉండడం ఇందుకు నిదర్శనం. కరుణ ఓటు హక్కువినియోగించుకుంటారా అని మీడియా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను ప్రశ్నించగా, వేచి చూడాలని సూచించారు.
పీఎంకే దూరం:
రాష్ట్రపతి ఎన్నికలను పీఎంకే బహిష్కరించింది. లోక్‌సభ ఎన్నికల్లో ధర్మపురి నుంచి పీఎంకే యువజన నేత అన్భుమణి రాందాసు పార్లమెంట్‌కు ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ పార్టీకి ఒకే ఒక సభ్యుడు రాష్ట్రంలో ఉన్నారు. అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యులే లేరు. ఉన్న ఒక్క సభ్యుడు ఓటు ఎవరికి వేస్తారోనన్న ప్రశ్న బయలుదేరింది. అయితే, తాము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని, ఎవ్వరికీ ఓటు వేయబోమని పీఎంకే అధినేత రాందాసు ప్రకటించారు. తమిళ ప్రజల మీద కేంద్రం చూపుతున్న చిన్నచూపునకు నిరసనగా ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఇక, రాష్ట్రం మీద కేంద్రం వైఖరిని నిరసిస్తూ పెరియార్ ద్రవిడ కళగం నేతృత్వంలో అన్నాడీఎంకే కార్యాలయం ముట్టడియత్నం ఆదివారం సాగింది. బీజేపీకి మద్దతు ఇవ్వొద్దని నినదిస్తూ ఆ కళగం వర్గాలు రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.