పాలనా వైఫల్యమే..!
Published Sat, Jan 11 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనతా దర్బార్ మొదటి రోజే అభాసుపాలైంది. లెక్కకు మించి ప్రజలు హాజరు కావడంతో అధికారులు చేష్టలుడిగి ఉండిపోయారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి శనివారం ముఖ్యమంత్రి స్వయంగా హాజరై జనతా దర్బార్‌ను నిర్వహిస్తారని ఆప్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా శనివారం ముఖ్యమంత్రి సమక్షంలో మొదటి జనతా దర్బార్‌ను నిర్వహించారు. దీనికి అధికారు లు ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మంది ప్రజలు హాజరవ్వడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ గందరగోళంలో ముఖ్యమంత్రి దర్బార్‌ను మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. కాగా, పాలనా విభాగానికి ముందు చూపు లోపించడం వల్లే జనతా దర్బార్‌లో గందరగోళం నెలకొందని పోలీసులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఎంత రక్షణ చర్యలు తీసుకున్నా పాలనాశాఖ సరైన ప్రణాళికతో ముందుకు రాకపోతే ఇలాం టి పరిస్థితులే ఎదురవుతాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
‘మేం జనతా దర్బార్ రక్షణకు ఎంతమంది సిబ్బందినైనా నియమించగలం. కాకపోతే దానివల్ల దర్బార్ లక్ష్యం నెరవేరదు. సామాన్యులెవరూ ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకోలేరు.. దాని బదులు జనతా దర్బార్‌ను ప్రాంతాల వారీగా, మంత్రిత్వశాఖల వారీగా, విషయాల వారీ గా నిర్వహిస్తే మరింత కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాటుచేయడానికి మాకు వీలు పడుతుంది..’ అని ఒక సీనియర్ పోలీస్ అధికారి అన్నారు. జనతా దర్బార్ ప్రాంతంలో సుమారు 500 మంది పోలీసులను,మరో 500 మంది పారా మిలటరీ దళాలను భద్రతకు ఏర్పాటుచేశారు. అయితే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, యూనియన్ల అత్యుత్సాహం వల్ల జనతా దర్బార్‌లో గందరగోళం నెలకొందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజెన్లు, వికలాంగు లు తమ సమస్యలను ముఖ్యమంత్రికి ఎలా విన్నవించుకోగలుగుతారని వారు ప్రశ్నించారు.
అటువంటి వారి కోసం ప్రత్యేక సమయం, స్థలం కేటాయిస్తే జనతా దర్బార్‌కు వచ్చి కష్టపడాల్సిన అవసరం ఉండదు..’ అని సూచించారు. మొదటి జనతా దర్బార్ గురించి ఆప్ ప్రభుత్వం ఎక్కువగా ప్రచారం చేసింది. అధికారుల ఏర్పాట్ల లోపంతో సెక్రటేరియట్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం గందరగోళమైంది. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యలోనే బలవంతంగా ఆ స్థలం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. కాగా, అనంతరం సీఎం మాట్లాడుతూ తాను దర్బార్‌ను మధ్యలో విడి చి వెళ్లిపోలేదన్నారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా భవిష్యత్‌లో శాశ్వత చర్యలు తీసుకుంటునామని హామీ ఇచ్చారు.
జనతా దర్బార్ నిర్వహించేది ఇలాగేనా: కిరణ్ బేడీ
ఢిల్లీ సెక్రటేరియట్ ప్రాంగణంలో జనతాదర్బార్ నిర్వహించడంపై కేజ్రీవాల్ ప్రభుత్వ తీరును శనివారం మాజీ పోలీస్ అధికారి కిరణ్ బేడీ విమర్శించారు.‘దేవుడి దయ వల్ల కేజ్రీవాల్, అతని మం త్రివర్గ సభ్యులు సెక్రటేరియట్ మీద ఎక్కి పరుగు లు పెట్టాల్సిన పరిస్థితి తప్పింది. ఇప్పటికైనా పరిస్థితులను ఆకళింపు చేసుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడితే బాగుంటుంది..’ అని ట్విట్టర్‌లో కేజ్రీవాల్‌కు ఆమె సలహా ఇచ్చా రు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ ఇన్‌చార్జి షకీల్ అహ్మద్ జనతా దర్బార్ ఫ్లాప్ షోగా మారడంపై ప్రతిస్పందిస్తూ ..‘ఇది కొత్త ప్రభుత్వం. అనుభవ రాహిత్యం వల్ల కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. మున్ముందు ఇలాంటి తప్పులు జరగకుండా కేజ్రీవాల్ సర్కారు చర్యలు తీసుకోవాలి..అని అన్నారు.
Advertisement
Advertisement