మరింత భద్రత | More Security in bangalore | Sakshi
Sakshi News home page

మరింత భద్రత

Published Tue, Dec 30 2014 5:11 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

మరింత భద్రత - Sakshi

మరింత భద్రత

* రాష్ర్టంలోనూ ‘పబ్లిక్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్’  
* రాష్ట్ర హోం శాఖ మంత్రి, సీనియర్ పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం
* రాష్ట్ర ఇంటలిజెన్స్ శాఖ పటిష్టం  

సాక్షి, బెంగళూరు : నగరంలోని చర్చ్ స్ట్రీట్‌లో జరిగిన బాంబు పేలుడు ఉదంతంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ప్రజల భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా కర్ణాటకలోనూ ‘పబ్లిక్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్’ను అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమైంది. బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్, డీజీపీ లాల్‌రుఖుమ్ పచావో, నగర పోలీస్ కమీషనర్ ఎంఎన్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన క్యాంపు కార్యాలయం కృష్ణాలో సోమవారం ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో బాంబు పేలుడు ఘటనకు సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగింది. బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు అధికారులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్‌లకు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ముఖ్యంగా బెంగళూరు నగరంలోని జనసందోహ ప్రాంతాల్లో ప్రజల రక్షణా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాల్సిన ఆవశ్యకతపై చర్చ జరిగింది.

ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) తరహాలో ‘పబ్లిక్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్’ను రాష్ట్రంలో సైతం అమల్లోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ యాక్ట్ ప్రకారం వంద మంది కంటే ఎక్కువ మంది జనసందోహం ఉన్న రెస్టారెంట్స్, మాల్స్, ఆస్పత్రులు, కార్యాలయాలు ఇలా అన్ని ప్రదేశాల్లోనూ సీసీటీవీ కెమెరాలను తప్పక అమర్చాల్సి ఉంటుంది. తద్వారా ప్రజల భద్రతపై మెరుగైన నిఘాను ఉంచేందుకు పోలీసులకు ఆస్కారం ఉంటుంది.

పోలీసు అధికారులు చేసిన సూచనలను విన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘పబ్లిక్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్’ను రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చేందుకు సమ్మతించినట్లు సమాచారం. ఇక ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ...ఈ తరహా ఘటనలు మరోసారి నగరంలో పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వివరాలు అందజేస్తున్నామని, దర్యాప్తును వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నుంచి సాంకేతిక సహకారాన్ని సైతం తీసుకుంటున్నామని చెప్పారు.
 
రాష్ట్ర ఇంటలిజెన్స్ శాఖను మరింత పటిష్టం చేసే దిశగా
ఇక రాష్ట్రంలో ఇంటలిజెన్స్ శాఖను మరింత పటిష్టం చేసే దిశగా సైతం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇంటలిజెన్స్ విభాగంలో ప్రత్యేక కేడర్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడంతో పాటు ఈ విభాగంలో నియామకాల కోసం సైతం ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. అంతేకాక సాంకేతిక పరమైన నైపుణ్యాలను సైతం ఈ సిబ్బందికి పెంపొందించడం తో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు గాను మరో 40 మంది నిపుణులైన ఇంజనీర్‌లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement