ఐపీఎల్ పిచ్‌లకన్నా ‘టీ’లకే ఎక్కువ నీరు ఖర్చు | more water for tea than ipl pitches | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ పిచ్‌లకన్నా ‘టీ’లకే ఎక్కువ నీరు ఖర్చు

Published Sat, Apr 9 2016 5:44 PM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM

more water for tea than ipl pitches

ముంబై: నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో ప్రజలంతా చక్కెర లేకుండా టీ తాగినట్టయితే రోజుకు కోటిన్నర లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు. రాష్ట్రంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ముంబై, పుణె, నాగపూర్ స్టేడియం పిచ్‌లకయ్యే నీటి ఖర్చుకన్నా చక్కెర లేకుండా ప్రజలు టీ తాగడం వల్ల 150 శాతం ఎక్కువ నీరు ఆదా అవుతుంది. నీటిని ఆదా చేసేందుకు ఐపీఎల్ మ్యాచ్‌లను రాష్ట్రంలో రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని బాంబే హైకోర్టు ఇటీవల బీసీసీఐకి సూచించిన విషయం తెల్సిందే. కోర్టు కూడా మ్యాచ్‌ల నిర్వహణపై ఎలాంటి స్టేను విధించక పోవడంతో ముంబై వాంఖేడ్ స్టేడియంలో ఇప్పటికే తొలి మ్యాచ్ జరిగి పోయింది.

ముంబై, పుణె, నాగపూర్ స్టేడియంలలో 20 మ్యాచ్‌ల నిర్వహణకు 60 లక్షల లీటర్ల నీరు ఖర్చవుతుందని లోక్‌సత్తా మూవ్‌మెంట్ తరఫున పిటిషనర్ కోర్టులో వెల్లడించారు. నేషనల్ జియోగ్రఫీ లెక్కల ప్రకారం ఓ కిలో చక్కెరను ఉత్పత్తి చేయడానికి 1500 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. ముంబైలోని 20 శాతం లేదా 25 లక్షల మంది ప్రజలు రోజుకు ఓ టీ స్పూన్ చెక్కరేసుకొని టీ తాగుతారనుకుంటే దాదాపు పదివేల కిలోల చక్కెర ఖర్చవుతుంది. అంటే దానికి రోజుకు కోటిన్నర లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలోని మూడు ఐపీఎల్ వేదికల్లో ఉపయోగించే నీటికన్నా రెండున్నర రెట్లు ఎక్కువ. ఇలాగే కాఫీలు, కోల్డ్ కాఫీలు, పాలు, కూల్ డ్రింకులు, హాల్కాహాలు లాంటివి లెక్కేసుకుంటే పోతే కోటానుకోట్ల లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు.
 

 దేశవ్యాప్తంగా వ్యవసాయ నీటి పారుదలకు 650 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఖర్చవుతుండగా, అందులో 15 శాతం లేదా వంద బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు చెరకు పంటకు ఖర్చవుతుంది. చెరకు క్రషింగ్‌కు అదనంగా నీరు ఖర్చవుతుంది. ఒక్కో చెక్కర ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్‌కు రోజుకు రెండు లక్షల లీటర్ల నీరు ఖర్చవుతుంది. 2009లో మహారాష్ర్టలో 40 చెక్కర ఫ్యాక్టరీలు ఉండగా, నేడు 52కు చేరుకున్నాయి.
 

 మహారాష్ట్ర ప్రజలు చెక్కర వాడకాన్ని మానేసినంత మాత్రాన చెరకు సాగు, చెక్కర ఉత్పత్తి తగ్గిస్తారా ? అన్న అనుమానం ఎవరికైనా రావచ్చు. మరయితే వాంఖేడ్ స్టేడియం పిచ్‌కు నీటి వినియోగాన్ని నిలిపేసినట్లయితే తీవ్ర కరవు పరిస్థితులు ఎదుర్కొంటున్న 400 కిలోమీటర్ల దూరంలోని లాథూర్‌కు ఆ నీటిని తరలించే అవకాశం ఉందా? లేదుకదా! చెక్కర వినియోగానికి, చెక్కర ఉత్పత్తి, చెరకు సాగుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని చెరకు పంటను, చెరకు ఉత్పత్తిని నియంత్రించినట్లయితే బోలెడంతా నీటిని ఆదా చేయవచ్చు. చెరకు సాగుకు బదులుగా నీరు తక్కువ అసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి.
 

 అరకిలో చికెన్‌కు 1500 లీటర్లు, కిలో మేక మాంసానికి 960 లీటర్లు, కిలో గోధమకు వెయ్యి లీటర్లు, లీటరు వైన్ బాటిల్ తయారీకి వెయ్యి లీటర్ల నీరు ఖర్చవుతుందని నేషనల్ జియోగ్రాఫిక్ లెక్కలు తెలియజేస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement