దాహార్తులు... జల విలాసాలు
విశ్లేషణ
నీరు పుష్కలంగా, శాశ్వతంగా లభిస్తుందన్నట్టు ప్రవర్తిస్తున్నాం. ఒకవంక జీవ జలం కోసం మునిసిపల్ ట్యాంకర్లపై ఆధారపడుతుండగా... మరోవంక షవర్ కింద చివరి నీటి బొట్టు అయిపోయే వరకు జలకాలాటలు సాగుతూనే ఉంటాయి.
దాహంతో తల్లడిల్లుతున్న పశ్చిమ మహారాష్ట్రలోని లాతూరు గొంతు తడపడా నికి 50 టాంకర్లతో నీటి రైలును నడుపుతున్నారు. మీరజ్ నుంచి బయల్దేరే నీటి రైలు అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలోని లాతూరు దాహార్తిని తీరుస్తుంది. అక్కడి నీటి సంక్షోభంతో పోలిస్తే దూరాలు కుదించుకు పోవాల్సిందే. విస్తృతమైన మీడియా ప్రచారం వల్ల లాతూరు అంటేనే మొత్తంగా మరఠ్వాడా ప్రాంతంలో నెలకొన్న తీవ్రమైన తాగునీటి కొరతకు సంకేతంగా మారింది. అలా అని ఆ ప్రాంతంలోని ఇతర చోట్ల సమస్య తక్కువగా ఉన్నదనేమీ కాదు.
ఈ నీటి ఎద్దడి దృష్ట్యానే ఐపీఎల్ క్రికెట్ పిచ్, ఔట్‌ఫీల్డ్‌లను చక్కగా ఉంచడం కోసం రోజుకు 60,000 లీటర్ల నీటిని వాడటం ఆలోచనాపరులకు ఆగ్రహాన్ని కలిగించింది. పొరుగింట్లో చావు జరిగితే, చాలా కాలంగా సన్నాహాలు చేసుకున్న పెళ్లింటి వారు సైతం వివాహ వేడుకల జోరును తగ్గించే చర్యలను చేపడతారు. అలాంటి సున్నితత్వం బీసీసీఐకి కొర వడింది. క్రిస్టఫర్ కోనీ, థామస్ హార్డీ రాసిన మేయర్ ఆఫ్ కాస్టర్‌బ్రిడ్జ్‌లోని ఒక రైతు పాత్ర. చనిపోయిన మేయర్ శవం నుంచి కొన్ని నాణేలను దొంగిలించి, తాగుడుకు తగలేస్తూ అతగాడు పట్టుబడతాడు. అప్పుడిక కోనీ ‘‘మరణం, నాలుగు పెన్నీల జీవి తాన్ని ఎందుకు హరించాలి? చావనేది, అంతగా గౌర వించాల్సినదేమీ కాదే’’ అంటూ తత్వం మాట్లాడతా డు. జీవితం కొనసాగాల్సిందేనని అతగాడి భావం. నిజమేగానీ, కాస్త జోరు తగ్గించి మెల్లగా సాగించాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే బీసీసీఐ విఫలమైంది.
మొదటి మ్యాచ్‌ను జరుపుకోడానికి హైకోర్టు అనుమతించింది. అయితే అంతకు ముందు అది, తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతున్నవారందరి పట్ల తగు స్పందనను చూపింది. ఆ సమస్యను ఉపశమింప జేస్తామనే మాటలతో సరిపెట్టుకోక, తగు చర్యలు అమలయ్యేలా చూశాకనే అనుమతిని మంజూరు చేసింది. ముంబై నగర నీటి నిర్వహణను గురించి కోర్టు అడిగి తెలుసుకుంది. దాన్ని ప్రతి గ్రామానికి, పట్టణానికి, నగరానికి వర్తింపజేయాలి. ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వం, ఈ సమస్య పౌర పరిపాలక సంస్థ తలనొప్పే తప్ప, తమది కాదని సైతం చెప్పింది. దాని మాటలే కాదు, ఆ తర్వాత బీసీసీఐ ప్రభుత్వం తో అన్న మాటలు కూడా బుద్ధిహీనమైనవే.
ఐపీఎల్ కోసం తాము ఉపయోగించుకునే నీటికి, అది కోల్పోవాల్సి వచ్చే పన్నులకు మధ్య ఏం కావాలో తేల్చుకోవాలని బీసీసీఐ మొరటుగా రాష్ట్ర ప్రభుత్వా నికి చెప్పింది. ఐపీఎల్ వల్ల రూ. 100 కోట్ల పన్నులు వస్తాయంటూ అది లెక్కలు కూడా చెప్పింది. అదెలాగో అర్థం కాదు. ఒకవేళ బీసీసీఐ, ఐపీఎల్‌లు తమకు వచ్చే రాబడి గురించిగాని మాట్లాడలేదు గదా? ఇంతకు మించిన తలబిరుసుతనం మరొకటి ఉండదు. ‘‘మ్యాచ్‌లను మహారాష్ట్ర బయటకు తరలించినా ఫర్వాలేదు’’ అంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆచి తూచి సమాధానం చెప్పారు.
అత్యున్నత అధికార స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పగలిగిన దానికంటే అది చాలా బలహీనమైన సమాధానం. డబ్బు శ క్తి, ప్రభుత్వాన్ని సైతం ఎంతగా అణగిమణగి ఉండేలా చేయగలదో ఇది సూచిస్తుంది. బీసీసీఐ ప్రభుత్వ సంస్థేమీ కాదు, ప్రైవేటు కార్పొరేటు సంస్థ. కనీసం అది పారదర్శకతకు, జవాబుదారీతనానికైనా బాధ్యత వహించాలని సుప్రీం కోర్టు దానికి గుర్తు చేస్తోంది. బీసీసీఐని సంస్కరించాలని అది కోరవచ్చుగదా అనొచ్చు. అదే జరిగితే, అలాంటిదేమీ అవసరంలేదనే వాదనలతో న్యాయవ్యవస్థను అది ఎదుర్కొంటుంది.
నీటి వినియోగం సున్నితమైన అంశం. కానీ మనలో చాలా మందిమి నీరు పుష్కలంగా, శాశ్వతంగా లభిస్తుందన్నట్టు ప్రవర్తిస్తున్నాం. హైదరాబాద్‌లో ఒకవంక జీవ జలం కోసం మునిసిపల్ ట్యాంకర్లపై ఆధారపడుతుండగా... మరోవంక మహోత్సాహంగా షవర్ కింద చివరి నీటి బొట్టు అయిపోయే వరకు జలకాలాటలు సాగుతూనే ఉంటాయి. చివరికి పౌర పరిపాలక సంస్థ అధ్వాన నిర్వహణను తిట్టిపోస్తారు. మహారాష్ట్రలో సాధారణం గా తలెత్తుతుండే నీటి కొరతల సమయం లో ట్యాంకర్లు వచ్చేది మాఫియాల నుంచే తప్ప, పౌర పరిపాలక సంస్థ నుంచి కాదు. నీటి ట్యాంకర్లు నడిపి తే నాలుగు డబ్బులు సంపాదించొచ్చని లాతూరులో ఉద్యోగాలు మానేస్తున్నారు.
బీసీసీఐ, ఐపీఎల్‌ల నీటి వినియోగానికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపథ్యాన్ని చూడండి. ఒకటి, విద్యార్థులు తమ నీటిని తామే తెచ్చుకోవాలని ప్రభుత్వం నడిపేవాటితో సహా పలు పాఠశాలలు కోరాయి. స్కూలు బ్యాగు బరువుకు మరింత బరువు. రెండు, దియెనార్ చెత్త డంపింగ్ యార్డులో చెలరేగిన మంటల వల్ల నగరాన్ని రోజుల తరబడి పొగ చుట్టేసింది. ఆ మంటలను చల్లార్చడానికి తాగు నీటిని వాడాలా, లేదా? అని స్థానిక పౌర పరిపాలక సంస్థలోనే చర్చ జరిగింది. అయినాగానీ, ఈ కేసు విచారణ సమయంలో పిటీషనరు, న్యాయమూర్తులు తప్ప మరెవరూ నీటి వినియోగం పట్ల పట్టింపును చూపలేదు. ఒక సందర్భంలో వారు దీన్ని ‘‘నేరపూరితం’’ అని సైతం అన్నారు. ఏదేమైతేనేం, చివరి క్షణంలో మ్యాచ్‌లను మార్చడం సులువేమీ కాదని బీసీసీఐ, ఐపీఎల్ అధిపతులు పట్టుబట్టారు. గొప్ప కార్పొరేట్ సామాజిక బాధ్యతను నిర్వర్తించలేకపోతాం అన్నట్టుంది వారి వైఖరి. వారే అభ్యంతరం తెలపకపోయి ఉంటే... నీరు జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అత్యంత విలువైన వనరనే సందేశం నీటిని ఉపయోగించుకునే ప్రతివారికీ చేరేది.
మరీ ముఖ్యంగా బీసీసీఐ ఉపయోగించే ట్యాంకర్ల నుంచి పొంగిపొర్లే రెండు తొట్టెల నీటితో రోజంతా ఎనిమిది మంది కుటుంబం గడపాల్సి వస్తున్న పరిస్థితుల్లో అది మరింత అవసరం. ఆ ట్యాంకర్ల డ్రైవర్లు బీసీసీఐ కారు కాబట్టి, బహుశా వారు సైతం నీటి కొరతతో అల్లాడుతుండొచ్చు.
వ్యాసకర్త: మహేష్ విజాపుర్కార్
సీనియర్ పాత్రికేయులు, ఈమెయిల్: mvijapurkar@gmail.com