కరువులో కొత్త ఉపద్రవం
విశ్లేషణ
నీటి ఆదాకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. రెస్టారెంట్లు కూడా నీటిని పరిమితంగా వాడాలి. స్నానాలప్పుడు షవర్లకు బదులుగా బకెట్ నీటిని వాడాలి. కానీ మనవంతుగా మనం ఈ చర్యలకు పూనుకుంటున్నామా?
మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒక సీనియర్ రాజకీయ నేత ఏక్‌నాథ్‌ఖడ్సే. ఉప ముఖ్యమంత్రి అనే గుర్తింపు లేకపోయినప్ప టికీ ముఖ్యమంత్రి తదు పరి స్థాయి గల వ్యక్తి. ఆయన నుంచి అంతటి వివేకాన్నే ఆశిస్తాము. కాని లాతూర్‌కి సమీపంలోనే ఉన్న ప్రాంతంలో ఆయన హెలికాప్టర్‌లో దిగిన ప్పుడు దుమ్ము రేగకుండా ఉండేందుకు హెలిప్యాడ్ చుట్టూ 10 వేల లీటర్ల నీటిని చల్లారు. కానీ వాస్తవానికి ఇదే తీవ్ర దుమారాన్ని రేకెత్తించింది.
నీటి కరువుతో అట్టుడుకుతున్న లాతూర్ సమీపంలో ఒక హెలిప్యాడ్‌పై అంత భారీ పరిమాణంలో నీటిని చల్లడం గురించి ఖడ్సేకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. కానీ విషయం బహిరంగ మయ్యాక, ఏ ఒక్కరూ దానిపై వివరణ ఇవ్వలేదు సరికదా.. కాస్తంత పశ్చాత్తాపాన్ని కూడా ఎవరూ ప్రకటించలేదు. స్థానిక అధికారులను చీవాట్లు పెట్టారో లేదో మనకు తెలియదు. జరిగిన ఘటనపై ఏక్‌నాథ్‌ఖడ్సే విచారం వ్యక్తపర్చిందీ లేనిదీ కూడా మనకు తెలియదు. మండువేసవిలో చల్లిన 10 వేల లీటర్ల నీరు చూస్తుండగానే ఆవిరైపోయిన చందాన, ఈ కుంభకోణం కూడా ఆవిరైపోతుంది లెమ్మనే ఆశాభావంతో ప్రతి ఒక్కరూ వీలైనంత ప్రశాంత చిత్తంతో ఉండిపోయారు.
అత్యంత విలువైన నీటిని వినియోగించడం ద్వారా దుమ్ము రేగని విధంగా హెలికాప్టర్ దిగేందుకు స్థానిక యంత్రాంగం ఎలా సహకరించిందనేది వింత గొలుపుతుంది. ఏమాత్రం సున్నితత్వాన్ని ప్రదర్శించక పోవడాన్నే ఈ ఘటన తెలుపుతోంది. తానెక్కిన హెలికాప్టర్‌ను దుమ్ము రేగుతున్న స్థితిలోనే దింపాలని, ఆ నీటిని రెండు ట్యాంకర్లలో ఏదైనా గ్రామానికి పంపాలని ఖాడ్సే అధికారులను ఆదేశించి ఉంటే, జీవనదాయిని అయిన నీటి విలువ పట్ల ఆయన సున్నితంగా వ్యవహరించి ఉండేవారు. నీరు అమూల్యమైనదే. కానీ లభ్యమవుతున్నప్పుడు దాన్ని ఎవరూ లెక్కించరు.
మీరజ్, లాతూర్ మధ్య శుద్ధి చేసిన మంచి నీటి క్యారియర్లతో కూడిన రెండవ రైలును కూడా అందుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం అంతటి సున్నితత్వాన్ని ప్రదర్శించలేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి జరుపుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లను మహారాష్ట్ర నుంచి మళ్లించవలసి రావడంతో ఖిన్నుడైన బీసీసీఐ కార్యదర్శి.. రాష్ట్రంలోని ఐదు నక్షత్రాల హోటళ్లలోని స్విమ్మింగ్ పూల్స్‌లో నీరు లేకుండా, పచ్చిక బయళ్లకు నీరు పెట్టకుండా చేస్తున్నారా? అని సరిగ్గానే ప్రశ్నించారు. ఆయన చెప్పిందాంట్లో గుర్తించవలసిన అంశముంది. నీటిని ఆదా చేయటమనే విధిలో ప్రతి చోటా ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు, వాషింగ్‌మెషిన్ పూర్తిగా మురికి దుస్తులతో నిండిపోయేంతవరకు ఇళ్లలో ఎవరూ బట్టలు ఉతకకూడదు. ఇక రెస్టారెంట్లు కూడా నీటిని పరిమితంగా వాడాలి. అరగ్లాసు నీటితో మొదలెట్టాలి. గ్రామాల నీటివనరులను, చాలావరకు భూగర్భజలాలను ఉపయోగించకుండా బాటిల్ వాటర్ ఎక్కడినుంచో ఊడిపడదు మరి. స్నానాల విషయంలో షవర్లకు బదులుగా బకెట్ నీటిని ఉపయోగించాలి. అది కూడా నిండు బకెట్‌తో కాదు. కానీ, ఏక్‌నాథ్‌ఖడ్సేపై మనం విమర్శలు గురిపెడుతున్నప్పుడు, మనవంతుగా పై చర్యలకు పూనుకుంటున్నామా?
ఏమైనప్పటికీ, ప్రజలు నీటికోసం అల్లాడు తున్నారని, మీ కుళాయిలను పూర్తి సామర్థ్యంతో పనిచేయించవద్దని ప్రభుత్వం ప్రజలకు బోధించ వలసి ఉంది. దీనికి బదులుగా ప్రభుత్వం లాతూర్ సమీపంలో హెలిప్యాడ్‌పై పెద్దఎత్తున నీరు చల్లడాన్ని అనుమతిస్తోంది. మరట్వాడాలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత ఘోర నీటి సంక్షోభానికి ఇదొక శ్లేష వంటిది. బీసీసీఐ గౌరవ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యను ప్రభుత్వం తీవ్రంగానే స్వీకరించి నీటి వినియోగంపై ఆంక్షలు విధించవచ్చు. అలాగే ముంబైలో మంత్రుల బంగ్లాల్లోనూ పచ్చిక బయళ్లు ఉన్నాయి మరి.
విచారకరమైన విషయం ఏమిటంటే, మహారాష్ట్రలోని కొన్ని చక్కెర పరిశ్రమలు అధిక సామర్థ్యంతో పనిచేసే పంపుసెట్లను ఉపయోగించి, తమ ప్లాంట్లను పనిచేసేలా చూడటానికి ప్రయత్నించాయి. ఇదంతా మరుగునే జరిగి ఉండొచ్చు కానీ ఈ విషయం మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పుడు ఆ పరిశ్రమ లపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలూ లేవు. సహకారరంగంలో ఉన్నా, ప్రైవేట్ రంగంలో ఉన్నా.. చక్కెర పరిశ్రమలు రాజకీయ నేతలు, రాజకీయాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవి. వీటితో ఎల్లప్పుడూ అత్యంత సున్నితంగా వ్యవహరించేవారు.
అలా డయల్ చేయండి చాలు, వాణిజ్య చిరునామా డైరీ.. మరట్వాడా ప్రాంతంలోని అతిపెద్ద నగరం ఔరంగాబాద్‌లోని 20 నీటి శుద్ధి ప్లాంట్‌ల జాబితాను ఇట్టే చూపిస్తుంది. మిగిలినవాటిలాగే ఈ నగరం కూడా తీవ్ర మైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. కానీ మనకు తెలుస్తున్న దేమిటంటే, స్థానిక నీటినే ఉపయోగిస్తూ ఈ ప్లాంట్‌లు ఇప్పటికీ నడుస్తున్నాయి. అలాగే నీటిని విస్తృతస్థాయిలో ఉపయోగిస్తూ బీర్ తయారీ దారులు బీరును తయారుచేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీటిని మూసివేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
ఈ చర్యలు చేపట్టడం అవసరమయినపుడు నీటి వృధా.. అది ఐపీఎల్, బీసీసీఐ ద్వారా జరిగినా లేదా వంట గదిలోని కుళాయి ద్వారా జరిగినా క్షంతవ్యం కాదు. కొన్ని రైల్వే స్టేషన్లను దయచేసి గమనించండి.. సమీప గ్రామాలనుంచి ప్రజలు రైలు కంపార్ట్‌మెంట్లలోకి దూరి ఫ్లష్ నుంచి వచ్చే నీటిని సేకరిస్తుండటాన్ని చూడవచ్చు. ఆ నీరు నేరుగా టాయ్‌లెట్‌లోకి వెళ్లేది. నీటి సమస్యను కరువు కాలం చర్చగా పరిమితం చేయవద్దు.
వ్యాసకర్త మహేష్ విజాపుర్కార్ సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com