మూడో పెళ్లికి అడ్డుగా ఉందని..!
చెన్నై: మూడో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉందని కన్న బిడ్డనే తల్లి కూతుళ్లు కలిసి హత్య చేశారు. ఈ సంఘటనలో తల్లిని, కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజపాళయం సమీపంలో గల ముక్తానది గ్రామానికి చెందిన ముత్తు కుమార్తె రామలక్ష్మి(22) బీఏ చదువుతూ సగంలో ఆపేసింది. ఈమెకు వెంగానల్లూర్ గ్రామానికి చెందిన కరుప్పుస్వామి(22)తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చింది.
ఈ విషయాన్ని దాచి ఆమె తల్లి ముత్తు నెల్లె జిల్లాకు చెందిన గోపి అనే యువకుడితో పెళ్లి చేసింది. వివాహం అయినా వారానికి రామలక్ష్మి అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరిక్షించిన వైద్యులు రామలక్ష్మి గర్భవతి అని చెప్పారు. దీంతో గోపి తల్లిదండ్రులు రాజపాళయం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో ఆమె నిజం అంగీకరించటంతో పుట్టింటికి పంపేశారు.
ఆ తర్వాత ఆమె కరుప్పుస్వామిని రెండో పెళ్లి చేసుకుంది. ఇతడితో కలిసి ముక్తానది గ్రామంలో నివసిస్తున్న ఆమె జూలై 12వ తేదీన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం కరుప్పుస్వామి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. వారు బిడ్డను చూడడానికి రాలేదు. తల్లి తన కుమార్తెకు మూడో పెళ్లి చేయాలని నిర్ణయించింది. పెళ్లికి అడ్డుగా ఉన్న బిడ్డను చంపేయాలని తల్లి కూతుళ్లు నిర్ణయించుకున్నారు.
కన్న బిడ్డను గొంతు నులిమి చంపి మృతదేహాన్ని బుధవారం వెంగానల్లూర్‌లో గల కరుప్పుస్వామి ఇంట్లో పెట్టి వచ్చారు. ఇంటికి తిరిగి వచ్చిన అతని కుటుంబీకులు బిడ్డ ఎలా వచ్చిందని చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. విషయం తెలుసుకున్న వారు తలవాయపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేయటంతో తల్లి కూతుళ్లు ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు.