కూతురు మృతిపై తల్లి ఫిర్యాదు
► 44 రోజుల తరువాత మృతదేహం వెలికితీత
తిరువళ్లూరు: కూతురు మృతిలో మిస్టరీ ఉందని ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్‌కు తల్లి చేసిన ఫిర్యాదు మేరకు దాదాపు 44 రోజుల తరువాత మృతదేహాన్ని వెలికితీసి శవరీక్ష నిర్వహించిన సంఘటన తిరువళ్లూరు జిల్లా వేపంబట్టులో సోమవారం సాయంత్రం కలకలం సృస్టించింది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు ప్రాంతానికి చెందిన యాయుద్దీన్ కుమారుడు కార్తికేయన్(35) ఆరోగ్యశాఖలో పని చేస్తున్నాడు. ఇతనికి పళ్లికారనై ప్రాంతానికి చెందిన మహాలక్ష్మీ(32)కి 2014 మేలో వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఈ నేపథ్యంలో గత జనవరి 21న మహాలక్ష్మీ మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులకు కార్తికేయన్ సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
అయితే తన కుమార్తె మృతిలో మిస్టరీ ఉన్నట్టు ఆమె తల్లి అంజలదేవి ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్‌కు ఫిబ్రవరి20న పిర్యాదు చేసింది. తన కుమార్తె మృతిలో ఉన్న మిస్టరీ కోసం పోస్టుమార్టం నిర్వహించాలని కోరగా, సంబంధిత ఫిర్యాదును సెవ్వాపేట పోలీసులకు బదిలీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందుకున్న సమాచారంతో మహాలక్ష్మి మృతిని అనుమానంగా భావించి కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే సోమవారం ఆర్డీవో దివ్యశ్రీ,, డీఎస్పీ ఈశ్వరన్ నేతృత్వంలో శవాన్ని వెలికి తీశారు.
అనంతరం డాక్టర్ శోభన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మహిళ మృతదేహాన్ని దాదాపు 44 రోజుల తరువాత వెలికి తీయడంతో పాటు పోస్టుమార్టం నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శవపరీక్ష వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపడంతో పాటు తప్పు జరిగినట్టు నిర్ధారణ జరిగితే సంబంధం ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో దివ్యశ్రీ, డీఎస్పీ ఈశ్వరన్ స్పష్టం చేశారు.