బిడ్డల స్వార్థానికి తల్లి ‘బలి’ | mother died due to children's exploited | Sakshi
Sakshi News home page

బిడ్డల స్వార్థానికి తల్లి ‘బలి’

Published Tue, Dec 30 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

బిడ్డల స్వార్థానికి తల్లి ‘బలి’

బిడ్డల స్వార్థానికి తల్లి ‘బలి’

ప్రపంచం వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధిస్తున్నప్పటికీ మూఢనమ్మకాలు ఇంకా విజృంభిస్తూనే ఉన్నాయి. కొందరు మంత్రగాళ్లుగా అవతారమెత్తి ప్రజల బలహీనతలను సొమ్ముచేసుకుంటున్నారు. సొంత లాభం కోసం కన్నతల్లిని బలిచ్చిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.
 
సాక్షి, ముంబై: ఇద్దరు కొడుకులు తమ సొంత ప్రయోజనాలకోసం కన్నతల్లినే బలిచ్చారు. ఆలస్యంగా వెలుగులోకివచ్చిన ఈ ఘటన నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ సమీపంలోని టాకే హర్ష్ గ్రామంలో గత అక్టోబర్ నెలలో దీపావళి పండుగ సమయంలో జరిగింది.ఈ ఘటనలో తల్లి బుధిబాయితోపాటు మరో మహిళ కాశిబాయిని కూడా దుండగులు బలిచ్చారు.‘శ్రమజీవి సంఘటన’ చొరవతో మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఘోరంపై ఘోటి పోలీసులు కేసు నమోదు చేసుకుని పదిమందిని అరెస్టు చేశారు.

పోలీసులు అందించిన వివరాల మేరకు.. ఠాణే జిల్లా మోకాడా తాలూకాలోని దాండవల్ గ్రామానికి చెందిన బుధిబాయికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా, కొంతకాలంగా తమ కుటుంబాల్లో సుఖశాంతులు కరువయ్యాయని కుమారులైన కుమారులైన కాశినాథ్ దోరే (31), గోవింద్ దోరే (28) తమ సోదరి రాహిబాయితో చెప్పుకుని తరచూ బాధపడేవారు దీంతో టాకే హర్షే గ్రామంలో బచ్చుబాయి అనే మంత్రగత్తె ఉందని, ఆమెను కలిస్తే వారి సమస్యలు తొలగిపోతాయని రాహిబాయి తన సోదరులకు సలహా ఇచ్చింది.

ఆమె సలహా మేరకు కాశినాథ్ (31), గోవింద్‌లు మంత్రగత్తెను కలిశారు. కాగా, అన్నదమ్ముల కుటుంబాల్లో కలతలకు నష్టజాతకులైన తల్లి, సోదరిలే కారణమని ఆమె చెప్పింది. వారిద్దరినీ బలిస్తే సదరు అన్నదమ్ముల కుటుంబాలకు కలిసి వస్తుందని నమ్మబలికింది. ఆమె మాటలను విశ్వసించిన అన్నదమ్ములిద్దరూ దీపావళి పండుగ సమయంలో తల్లి బుధిబాయి, సోదరి రాహిబాయిని మంత్రగత్తె దగ్గరకు వెంటతీసుకువెళ్లారు.

అక్కడ మంత్రగత్తె అనుచరులు మహిళలిద్దరినీ పూజ చేయాలని చెప్పి, నగ్నంగా చేసి హింసించారు. అనంతరం బలి ఇచ్చేందుకు వారిని సిద్ధం చేశారు. అయితే అదునుచూసుకుని రాహిబాయి తప్పించుకున్నప్పటికీ , తల్లి బుధిబాయి మాత్రం వారి చేతిలో బలయిపోయింది. కాగా, ఈ విషయం తెలుసుకున్న ‘శ్రమజీవి సంఘటన’ వాస్తవాలను బయటపెట్టేందుకు కృషిచేసింది. అయితే మంత్రగత్తె తన మంత్రశక్తులతో తమను ఏం చేస్తుందోననే భయంతో గ్రామస్తులెవరూ ఆమె గురించి మాట్లాడేందుకు ముందుకు రాలేదు.

అయితే ఎంతో కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత రాహిబాయి పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఒప్పుకోవడంతో అసలు విషయం బయటపడింది. దీంతో మంగళవారం ఉదయం పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పదిమందిని అరెస్టు చేశారు. వీరిలో నిందితులు కాశినాథ్, గోవింద్‌తోపాటు మంత్రగత్తె బచ్చుబాయి, ఆమె అనుచరులుగా భావిస్తున్న ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. బుధిబాయితో పాటు కాశిబాయి అనే మహిళను కూడా బలిఇచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రగత్తె బచ్చుబాయి మాట్లాడుతూ.. ఏడుగురు వ్యక్తులను బలిస్తే తనకు అతీంద్రియ శక్తులు పొందుతాననే నమ్మకంతో ఇప్పటికి ఇద్దరిని బలిచ్చానని తెలిపింది. కాగా, వారు ఇచ్చిన సమాచారం మేరకు మహిళలను బలిచ్చిన ప్రదేశంలో మృతదేహాలను బయటికి తీశామని, పోస్ట్‌మార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఏపీఐ మనోరే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement