
రంగంలోకి ప్రత్యేక విచారణ బృందం
సాక్షి, చెన్నై : మౌళివాకం ఘటన విచారణకు ప్రత్యేక బృందం(సిట్) రంగంలోకి దిగనుంది. చెన్నై మహానగర పోలీసు కమిషనర్ జార్జ్ పర్యవేక్షణలో ఓ జాయింట్ కమిషనర్ నేతృత్వంలో ఈ బృందం విచారణ వేగవంతం చేయనుంది. ఈ వ్యవహారం కొందరు సీఎండీఏ అధికారుల మెడకు బిగుసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. మౌళివాకంలో బహుళ అంతస్తుల భవనం కూలిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన అత్యధిక మంది ఈ ఘటనలో దుర్మరణం చెందారు. ఈ ఘట నను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. న్యాయ విచారణ ఓ వైపు జరుగుతుంటే, మరో వైపు ఈ కేసు విచారణ వేగవంతం చేయడానికి ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను రంగంలోకి దించింది. ఆదివారం ఇందుకు సంబంధించిన ఆదేశాల్ని సీఎం జయలలిత జారీ చేశారు.
మౌళివాకం ఘటనకు సంబంధించి మాంగా డు పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కేసులో ఆ భవన యజమాని, ఆర్కిటెక్ట్, ఇంజనీర్లు అరెస్టు అయ్యారని వివరించారు. విచారణను వేగవంతం చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించుతున్నామని ప్రకటించారు. చెన్నై మహానగర పోలీసు కమిషనర్ జార్జ్ పర్యవేక్షణలో ఓ జాయింట్ కమిషనర్ నేతృత్వంలో ఈ బృందం విచారణ వేగవంతం చేస్తుందన్నారు. నిర్మాణ రంగంలోని సాంకేతిక అంశాలు, అనుమతుల పరంగా పరిశీలన, నిబంధనల గురించి ఈ విచారణ బృందానికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. చెన్నై ఐఐటీ,అన్నా వర్సిటీ నిపుణులు ఈ బృందానికి సహకారంగా ఉంటారని, సాంకేతిక ఆలోచనలు, విధానాలను ఆ నిపుణులు ఎప్పటికప్పుడు బృందానికి అందించనున్నారని ప్రకటించారు.
అధికారుల మెడకు ఉచ్చు :
మౌళివాకం ఘటన పలువురు సీఎండీఏ అధికారుల మెడకు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ బృందానికి సర్వాధికారాల్ని సీఎం జయలలిత ఇచ్చారు. అలాగే, సాంకేతిక అంశాలు, అనుమతుల పరంగా, నిబంధనల పరంగా అవగాహన చేసుకోనున్న దృష్ట్యా, అధికారుల చేతివాటం వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ కేసు పరిధిలోకి మాంగాడు పోలీసులు ఆర్కిటెక్ట్, స్ట్రక్చర్ ఇంజనీర్లను ఏ విధంగా చేర్చారో అదే తరహాలో సీఎండీఏ అధికారుల పేర్లను చేర్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రోడ్డు విస్తరణకు సంబంధించి రెవెన్యూ అనుమతులు, కుండ్రత్తూరు పంచాయతీ అధికారులు ఇచ్చిన అనుమతులను ఈ బృందం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సీఎండీఏలో అనుమతుల, అంచనాల విభాగం అధికారులు, ప్రధాన సభ్యుడు ఒకరు సైతం భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన ధృవీకరణ పత్రాల్లో సంతకాలు చేసి ఉన్న దృష్ట్యా, వీరందర్నీ విచారణ బృందం ప్రశ్నించే అవకాశాలున్నాయి.