కేసీఆర్‌తో ముంబై టీ-జాక్ భేటీ
ముంబైలో ఉంటున్న వలసబిడ్డల సమస్యల ఏకరువు
తెలంగాణ రాష్ట్రంలో ఆదుకోవాలని వేడుకోలు
కొత్త ప్రభుత్వం వచ్చాక నెరవేరుస్తానని కేసీఆర్ హామీ
సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె.చంద్రశేఖర్ రావుతో ముంబై టీ-జాక్ సభ్యులు ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముంబైలో ఉంటున్న వలసబిడ్డలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన ఎదుట ఏకరువు పెట్టారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రొఫెసర్ కోదండరాం,మల్లేపల్లి లక్ష్మయ్య నేతృత్వంలో హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ముంబై టీ జాక్ సభ్యులు వెళ్లిన విషయం తె లిసిందే.
ఆదివారం సదస్సు అనంతరం కేసీఆర్ నివాసంలో భేటీ అయ్యారు. ముందుగా తెలంగాణ సాధించినందుకు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా ముంబై, భివండీలో వలస బిడ్డలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులధ్రువీకరణ పత్రాలు, నాకా కార్మికుల భద్రత, రైళ్ల కొరత, వలస జీవులకు తెలంగాణ రాష్ర్టంలో ఉపాధి, స్థలం, ఉన్నత విద్యారంగంలో అడ్మిషన్లు, తెలుగు పాఠ్యపుస్తకాలు సకాలంలో అందజేత, ముంబైలో తెలంగాణ భవనం తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. నవ తెలంగాణలో స్వీయ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ముంబైలో ఉంటూ తెలంగాణ ఏర్పాటుకు సంఘీభావం, మద్దతు తెలిపినందుకు, వివిధ ఆందోళనలో హైదరాబాద్‌కు వచ్చి పాల్గొన్నందుకు ముంబై టీ-జాక్ సభ్యులందరినీ ఆయన అభినందించారు. కేసీఆర్‌తో భేటీ అయిన వారిలో ముంబై టీ ఐకాస చైర్మన్ మూల్‌నివాసి మాల, వైస్ చైర్మన్ కె.నర్సింహౌడ్, తెలంగాణ విద్యావంతుల వేదిక మహారాష్ట్ర కన్వీనర్ జి.గంగాధర్, బొల్ల శివరాజ్, పాండురంగ్ పద్మశాలి, సరిమల్లె శ్రీనివాస్, వడ్లకొండ రాము తదితరులున్నారు.