సాక్షి, ముంబై: రోడ్డు ప్రమాదాల్లో గాయపడి మృత్యువుతో పోరాడే వారికి కనీససాయం అందించేందుకు కూడా చాలా మంది ముంబైకర్లు వెనకడుగు వేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. పోలీసుల, కోర్టుల్లో సమస్యలకు భయపడి 93 శాతం మంది నగరవాసులు రోడ్డు ప్రమాదాల బాధితుల సహకారం అందించేందుకు ఇష్టపడడం లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల్లో ఓ బీమా కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది.
బాధితులకు సాయం చేసే నగరవాసుల్లో ముంబైకర్లు నాలుగోస్థానంలో ఉన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సహకరించడానికి తోటివాళ్లు ముందుకు రాకపోవడంతో మనదేశంలో రోడ్డు ప్రమాదాల బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. బెంగళూరులో 77 శాతం మంది, కోల్‌కతాలో 66 శాతం మంది రోడ్డు ప్రమాదాల బాధితులకు సాయమందించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ముంబైలో ఆటో డ్రైవర్లు ప్రమాదాలకు గురైన వారిపట్ల ఎక్కువగా స్పందిస్తున్నారు. నాణ్యమైన రోడ్లు, ట్రాఫిక్ నియమాలను పాటించడం.. ఈ రెండు అంశాల్లో ముంబై మిగతా నగరాలకంటే ముందంజలో ఉందని ఈ సర్వే తేల్చింది. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్‌టేక్ చేయడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపింది. ముంబైలో 57 శాతం మంది మాత్రమే సీటుబెల్టులు, హెల్మెట్లు ఉపయోగిస్తున్నారు. పురుషుల్లో 60 శాతం మంది మొబైల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడుపుతున్నారు.
మృతుల్లో యువతే అధికం..
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో యువత సంఖ్యే అధికంగా ఉన్నట్టు తేలింది. గత రెండేళ్లుగా రాష్ట్రంలోని జాతీయ రహదారి, హైవే, ఎక్స్‌ప్రెస్ హైవేలపై జరిగిన ప్రమాదాల్లో సుమారు 8,105 మంది యువతీ యువకులు బలయ్యారని పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాల్లో యువత మరణాలు అధికంగా ఉండడంపై పోలీసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 72 శాతం యువ తే ఉన్నట్లు మరో అధ్యయనంలో వెల్లడైంది. మహారాష్ట్రలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల్లో జరిగిన 1,91,450 రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 37,434 మంది చనిపోయారు. అలాగే 69,842 మంది తీవ్రంగా గాయపడగా, 56,992 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి ప్రధాన కారణాలు వాహన నియమాలు ఉల్లంఘించడమేనని పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినా, గాయపడినా అది జాతిసంపదకు హానిగానే పరిగణించాలని నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో 2011 నుంచి 2012 దాకా జరిగిన ప్రమాదాల్లో 9,286 యువతీయువకులు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో 8,105 మంది మృత్యువాతపడ్డారు. బాధితుల్లో 1,173 మంది యువతులని తేలింది. గత సంవత్సరం జనవరి నుంచి నవంబర్ వరకు పట్టణ ప్రాంతాల్లో మొత్తం 28,350 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి దుర్ఘటనలను అరికట్టడానికి ట్రాఫిక్ ఎక్స్‌ప్రెస్ హైవే పోలీసులు ప్రతి సంవత్సరం జనవరి మూడు నుంచి 17 వరకు ‘రోడ్డు భద్రతా అభియాన్’ పేరిట అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.