బెంగళూరులో ‘మజిల్ మేనియా’
* ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు రెండు రోజుల సెమినార్
* ఆగస్టు 29న ‘మజిల్ మేనియా’ ఇంటర్నేషనల్ బాడీబిల్డింగ్ పోటీలు
అమెరికాకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనింగ్ సంస్థ ‘మజిల్ మేనియా’ భారత్‌లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మొదటగా బెంగళూరులో బాడీ బిల్డింగ్ పై ఆసక్తి కనబరిచే యువతీ యువకులకు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు రెండు రోజుల పాటు (10,11) సెమినార్‌ను నిర్వహిస్తోంది.
సహజ విధానాలతోనే అద్భుత శరీరాకృతి
ఈ సందర్భంగా బాడీ బిల్డర్ సీమెన్ పాండా మాట్లాడుతూ... సాధారణంగా బాడీ బిల్డింగ్ అనగానే అందరూ మత్తు పదార్థాలు, స్టెరాయిడ్స్ వాడకం ద్వారానే శరీరాకృతిని మార్చుకోవచ్చని భావిస్తుంటారని అన్నారు. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదని స్టెరాయిడ్స్, డ్రగ్స్ వాడకం వల్ల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అందుకే తాము పూర్తిగా సహజ పద్ధతుల్లో, ఆరోగ్యకరమైన ఆహారం, సరైన వ్యాయామం ద్వారా శరీరాకృతిని మార్చుకునే పద్దతుల వైపే మొగ్గు చూపుతామని అన్నారు.
అంతేకాక మత్తు పదార్థాలకు తమ ఫిట్‌నెస్ సెంటర్‌లో చోటు ఉండదని అన్నారు. ఇదే అంశంపై బెంగళూరు వాసుల్లో అవగాహనను కల్పించేందుకు రెండు రోజుల పాటు నగరంలో సెమినార్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలోని దయానంద సాగర ఆడిటోరియంలో బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి చూపే వారికి సలహాలు సూచనలు అందించనున్నట్లు వెల్లడించారు.
ఇక ఆగస్టు 29న నగరంలో మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి ‘మజిల్ మేనియా’ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాడీ బిల్డర్‌లకు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చే అవకాశాన్ని కల్పించనున్నట్లు పేర్కొన్నారు.