మైసూరు రాజుగా యదువీర్
ఈ నెల 23న దత్తత స్వీకారం
ప్రమోదాదేవి ఒడయార్
మైసూరు: మైసూరు మహారాజుల వంశాకురం ఎవరు అన్న విషయానికి తెరపడింది. మైసూరు ప్యాలెస్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ సోదరీమణులతో కలిసి ఆయన సతీమణి రాణి ప్రమోదాదేవి మాట్లాడారు. మైసూరు రాజ వంశీకుడిగా ఒడయార్ సోదరి గాయత్రీ దేవి మనవడు యదువీర్ గోపాలరాజ అరసును ఎంపిక చేసినట్లు రాణి ప్రకటించారు. రాజ వంశస్తుల సంప్రదాయ ప్రకారం ఈ నిర్ణయాన్ని సమష్టిగా తీసుకున్నట్లు తెలిపారు.
ఈ నెల 23న ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మైసూరు ప్యాలెస్‌లో సంప్రదాయ ప్రకారం దత్తత స్వీకారం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం అమెరికాలోని బాస్టన్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని యదువీర్ అభ్యసిస్తున్నారని, దత్తత స్వీకారానంతరం వారం రోజుల పాటు మైసూరులో ఉండి, మళ్లీ విద్యాభ్యాసం కోసం వెళ్లిపోతారని వివరించారు. సమావేశంలో యదువీర్ తల్లి త్రిపురాసుందరి దేవి, తండ్రి స్వరూపానంద గోపాలరాజ అరసు తదితరులు పాల్గొన్నారు.