యువరాజుగా యదువీర్ | Mysore royals adopt new crown prince Srikantadatta Wodeyar | Sakshi
Sakshi News home page

యువరాజుగా యదువీర్

Published Tue, Feb 24 2015 1:39 AM | Last Updated on Fri, Jul 26 2019 5:59 PM

యువరాజుగా యదువీర్ - Sakshi

యువరాజుగా యదువీర్

కన్నుల పండువగా దత్తత స్వీకారం
యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్‌గా పేరు మార్పు
మేలో పట్టాభిషేక మహోత్సవం
 

మైసూరు :  యదువంశానికి 27వ యువరాజుగా యదువీర్ గోపాలరాజ అరసు దత్తత స్వీకారం వేడుకలు సోమవారం ఉదయం మైసూరులోని  ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించారు. దత్తత స్వీకారానికి సంబంధించి ఆదివారం ఉదయం నుంచే ప్యాలెస్‌లో ధార్మిక కార్యక్రమాలు ప్రారంభం కాగా సోమవారం ఉదయం మైసూరు రాజ వంశీయుల సంప్రదాయాల ప్రకారం దత్తత స్వీకారం వేడుకలను నిర్వహించారు. ఉదయం ప్యాలెస్‌లో ఉన్న గణపతి దేవాలయంలో మొదట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్యాలెస్ మైదానంలోఉన్న కోటె సోమేశ్వర దేవాలయం నుంచి గంగా జలాన్ని తీసుకవచ్చి గంగా పూజ నిర్వహించారు. అక్కడే గణపతి హోమం,  నంది పూజ,  నవగ్రహాల పూజ, మొదలైన ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1.20 నుంచి 1.50 గంటలకు  శుభ మిథున లగ్నంలో ఒడయార్ యదువీర్ గోపాలరాజ్ అరసును తమ కుమారునిగా మహారాణి ప్రమోదాదేవి దత్తత స్వీకరించారు. అనంతరం యదువీర్‌కు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ అనే పేరును  మరు నామకరణం చేశారు. అంతకు ముందు ఉదయం చాముండి కొండ పైన చాముండేశ్వరి దేవాలయంలో,  శృంగేరి శారదాపీఠంలో, ప్యాలెస్ మైదానంలో ఉన్న  నంజనగూడు శ్రీకంఠేశ్వర దేవాలయం, ఉత్తనహళ్ళి దేవాలయంలో రాజ వంశీయుల విధివిధానాల ప్రకారం విశేషపూజలు నిర్వహించారు.  అనంతరం అక్కడి నుంచి తీసుకు వచ్చిన అన్ని దేవాలయాల ప్రసాదాన్ని యదువీర్‌కు అందజేశారు.

పరకాళ మఠం బ్రహ్మతీర్థ పరకాలశ్రీ రాజయోగేంద్ర స్వామిజీకి యదువీర్ పాదపూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు మొత్తం మైసూరు ప్యాలెస్ ధర్మాధికారి జనార్ధన అయ్యంగార్ నేతృత్వంలో సుమారు 14 దేవాలయాలకు చెందిన ప్రధాన అర్చకులు, 40 మంది వేద పండితుల సమక్షంలో జరిగాయి. శ్రీకంఠదత్తనరసింహరాజు ఒడెయార్, రాణి ప్రమోదాదేవి ఒడెయార్‌ల వివాహం జరిగిన స్థలంలోనే ఈ దత్తత స్వీకారం వేడుకలను నిర్వహించడం విశేషం. యదువీర్ నామకరణం అనంతరం న్యాయనిపుణుల సమక్షంలో యదువీర్ పత్రాల పైన సంతకం చేశారు. రాజ వంశీయులు తెలిపిన వివరాల ప్రకారం యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ పట్టాభిషేకం  మే నెలలో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇక దత్తత స్వీకార మహోత్సవం పూర్తై అనంతరం యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ ఊరేగింపు కార్యక్రమం రాచనగరి వీధుల్లో వైభవంగా సాగింది. వెండి రథాన్ని అధిష్టించిన యదువీర్ మైసూరు నగర వీధుల్లో ప్రజలకు కనిపించారు. ఈ ఊరేగింపులో పట్టపు ఏనుగు, పట్టపు గుర్రం రథం ముందు కదిలాయి. ఈ ఊరేగింపును చూసేందుకు రాచనగరిలోని ప్రజలతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి కే.జే.జార్జ్, గృహ నిర్మాణశాఖ మంత్రి అంబరీష్, మైసూరు జిల్లాధికారి శిఖా.సీ, ఎమ్మెల్యే వాసు మొదలైనవారు వేడుకలకు హాజరైనారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement