తెలుగువాళ్లుగా మనం గర్వించాలి | Nagaphani Sharma under the 'capital of attention' to start | Sakshi
Sakshi News home page

తెలుగువాళ్లుగా మనం గర్వించాలి

Published Mon, Nov 3 2014 12:31 AM | Last Updated on Sun, Sep 2 2018 5:50 PM

తెలుగువాళ్లుగా మనం గర్వించాలి - Sakshi

తెలుగువాళ్లుగా మనం గర్వించాలి

స్వయం కృషితో పైకి రావాలన్న వ్యక్తిత్వం తెలుగువారిదని, తెలుగువారిగా మనమంతా గర్వించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు.

* ఎక్కడున్నా తెలుగువారంతా ఒక్కటే : జస్టిస్ ఎన్‌వీ రమణ  
* నాగఫణిశర్మ ఆధ్వర్యంలో ‘అవధాన రాజధాని’ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: స్వయం కృషితో పైకి రావాలన్న వ్యక్తిత్వం తెలుగువారిదని, తెలుగువారిగా మనమంతా గర్వించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. తెలుగువారంతా ఎక్కడ ఉన్నా అంతా ఒక్కటేనన్నారు. తెలుగు జాతి గొప్పదనాన్ని ఇతరులకు తెలియజెప్పేలా మాడుగుల నాగఫణిశర్మ అవధానాన్ని దేశ రాజధానిలో నిర్వహించడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. ఢిల్లీలో ఎనిమిది రోజులపాటు నిర్వహించనున్న ‘అవధాన రాజధాని’ కార్యక్రమాన్ని ఢిల్లీ తెలుగు అకాడమీ, అవధాన సరస్వతీపీఠం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం ఫిక్కీ ఆడిటోరియంలో ప్రారంభించారు.

కార్యక్రమానికి ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సత్యవ్రత శాస్త్రి, మాజీ ఎన్నికల అధికారి జీవీజీ కృష్ణమూర్తి, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, బల దేవానంద సాగర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ దేశ రాజధానిలో తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు సంస్కృతిని తెలియజెప్పేలా అవధాన రాజధానిని నిర్వహించడం, దీనిలో దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యావేత్తలంతా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

ఇక్కడ జడ్జిగా కంటే హైదరాబాద్‌లో ఉన్న రోజుల్లో తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషితో వచ్చిన గుర్తింపే తనకు అధికమని పేర్కొన్నారు. అవధాన ప్రారంభంలో భాగంగా ‘తెలుగు భాష దేశభాష రాజభాష అవుతుంది’ అని రమణ అడిగిన తొలి ప్రశ్నకు నాగఫణిశర్మ ఎంతో కవితాత్మకంగా సమాధానమిచ్చారు. ప్రపంచ భాషలన్నింటిలోనూ రమణీయమైన భాష తెలుగు అం టూ భాష గొప్పదనాన్ని చెప్పుకొచ్చారు. ‘జయతు..జయతు..’అని అవధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో ప్రశ్నగా సంస్కృతం నుంచి జ్ఞానపీఠ అవార్డు గ్రహీ త సత్యవ్రతశాస్త్రి సంధించారు. అవధాన కార్యక్రమ నిర్వహణకు గాను రూ. 50 వేలు విరాళాన్నిచ్చిన జస్టిస్ ఎన్‌వీ రమణను నాగఫణిశర్మ సత్కరించారు. సోమవారం నుంచి అవధాన కార్యక్రమాన్ని ఏపీభవన్ ఆవరణలో కొనసాగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement