
కూతే.. కూత
- ఉద్యాన నగరి నుంచి కొత్త రైళ్ల సంచారం
- రాజ్యోత్సవ కానుకగా ప్రకటించిన రైల్వే మంత్రి సదానంద
- బెంగళూరు రైల్వే స్టేషన్‌లో వైఫై సౌకర్యం
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర ప్రజలకు రాజ్యోత్సవ కానుకగా కొత్త రైలు సర్వీసులను రైల్వే శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ ప్రకటించారు. బెంగళూరు-చామరాజనగర, బెంగళూరు-తుమకూరు, బెంగళూరు-హుబ్లీ, బెంగళూరు-నెలమంగళ రైల్వే సర్వీసులను నవంబర్ 1న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇక వీటితో పాటు అక్టోబర్ 27న చండీఘడ్ నుంచి దక్షిణ భారతదేశానికి ఓ ప్రత్యేక రైలు, డిసెంబర్ 4న యశ్వంతపుర-జోధ్‌పుర, డిసెంబర్ 11న యశ్వంతపుర-కత్రాల నడుమ యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
బెంగళూరు రైల్వే స్టేషన్‌లో ఏర్పాటైన వైఫై సౌకర్యంతో పాటు ‘సుఖమంగళం’ ప్రత్యేక యాత్రా రైలును సదానంద గౌడ లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ కొత్త రైల్వే సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల ఆయా ప్రయాణ మార్గాల్లో ప్రయాణికుల రద్దీ తగ్గనుందని తెలిపారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రకటించిన ప్రాజెక్టుల్లో ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, మరో 20 శాతం పనులను త్వరలోనే పూర్తి చేయనున్నామని వెల్లడించారు.
రైల్వే శాఖలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభిం చినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థతో పాటు అనేక కార్యక్రమాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నట్లు తెలిపారు. గతంతో నిమిషానికి రెండు వేల టికెట్‌లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేస్తుండగా ప్రస్తుతం నిమిషానికి 7,800 టికెట్‌లను బుక్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ రెండు కోట్ల ముప్పై లక్షల మంది ప్రయాణిస్తున్నారని, 13వేల బోగీల్లో జైవిక శౌచాలయ (బయోటాయ్‌లెట్)లను ఏర్పాటు చేశామని చెప్పారు.
బయప్పనహళ్లి రైల్వే స్టేషన్‌ను ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునికీకరించనున్నట్లు తెలిపారు. బెంగళూరు నుండి బయలుదేరే అన్ని రైళ్లు బయప్పనహళ్లి రైల్వే స్టేషన్ నుండే బయలుదేరేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇక నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి గాను బీబీఎంపీ, రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సిన సగభాగం నిధులను ఇప్పటికీ అందజేయక పోవడంపై సదానంద గౌడ అసహనాన్ని వ్యక్తం చేశారు.
రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి గాను బీబీఎంపీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూ.120 కోట్లు చెల్లించాల్సి ఉందని, అయితే ఈ విషయంపై రెండు, మూడు సార్లు చర్చలు జరిపినప్పటికీ ఇప్పటికీ ఆ నిధులను చెల్లించలేదని అన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ....నగరంలోని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు గాను కె.ఆర్.పురం, యశ్వంతపుర, యలహంక, కెంగేరి ప్రాంతాల నడుమ లోకల్ ట్రైన్‌లను ప్రారంభించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ పి.సి.మోహన్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ తదితరులు పాల్గొన్నారు.