దోష పరిహారం చేసుకునే భక్తుల కోసం శ్రీకాళహస్తి ఆలయంలో ఇప్పటికే దేశంలో మరెక్కడా లేని విధంగా రాహుకేతు పూజలను చేస్తూ ఆలయ ప్రాశస్త్యానికి వన్నె తెచ్చారు. ఈనేపథ్యంలో శ్రీకాళహస్తి ప్రాంతంలో విశేష ప్రాధాన్యత కలిగిన నాగశిలల ప్రతిష్ట పూజలు అధికారికంగా దేవస్థానం సారథ్యంలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దేవస్థానం పాలకులు నిర్ణయం తీసుకోనున్నారు. నవంబర్ 1వతేది నుంచి ఈ పూజలను ఆలయ సమీపంలోని భరద్వాజతీర్థం వద్ద జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ కొందరు అర్చకులు భక్తులకు శ్రీకాళహస్తి సన్నిధివీధితోపాటు మరికొన్ని ఆలయాలు వద్ద నాగశిలల ప్రతిష్ట పూజలు చేసి వారి నుంచి రూ.25వేలు మేరకు వసూలు చేస్తున్నారు. దోపిడీకి స్వస్తి పలకడానికి తోడు ఆలయ ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఈ పూజలను రూ.15వేలకే చేసేందుకు ఆలయాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
నక్షత్రదోష పరిహారం కోసం నలుగురు అర్చకులతో నాగశిలలకు వివిధ అభిషేక పూజలు, హోమాలు చేసి ప్రతిష్టిస్తే దోషపరిహారం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ పూజకు అంతటి ప్రాచుర్యం ఉంది. భక్తుల విశ్వాసాలను కొందరు ఆలయ అర్చకులు అనధికారికంగా ఈ పూజలను ఆలయ సమీపంలో ఉన్న ఓ మఠం, నీలకంఠేశ్వరాలయం, మరికొన్ని చోట్ల నాగశిలల ప్రతిష్ట పూజలను చేస్తున్నారు. ఆలయ పాలకులు తీసుకోనున్న ఈ సరికొత్త నిర్ణయంతో భక్తులకు ఈ విశేషపూజ చేరువ కానుంది.
భక్తుల సౌకర్యార్థమే...
ఎంతో ప్రాచుర్యం ఉన్న నాగశిలల ప్రతిష్ట పూజను దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించాలని భావిస్తున్నాం. ఆ మేరకు భరద్వాజతీర్థంలో పూజలు చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ పూజకు అవసరమైన నాగశిలలతోపాటు పూజాసావుగ్రిని దేవస్థానం సమకూరుస్తుంది. రూ.15వేలు టికెట్ నిర్ణయించబోతున్నాం. నవంబర్ నుంచి భక్తులకు ఈ పూజలను అందుబాటులోకి తీసుకువస్తాం.
- గురవయ్యనాయుడు, ఆలయ చైర్మన్.