అతనెవరో చెప్పండి: లవ్లీ
Published Tue, Dec 31 2013 12:58 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య ఏ పారిశ్రామికవేత్త ఒప్పందం కుదిర్చాడో వెల్లడించాలని బీజేపీ నేత నితిన్ గడ్కారీని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మీరు ఆరోపణ చేసే ముందు, అది తప్పా? ఒప్పా? అన్నది ఒకటికీ రెండుసార్లు సరిచూసుకోవాలని గడ్కారీని ఉద్దేశించి మాట్లాడారు. ఆ పారిశ్రామికవేత్త ఎవరో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ ఏర్పాటును ఆపేందుకు ఓ పారిశ్రామికవేత్త రంగంలోకి దిగి కాం గ్రెస్, ఆప్‌ల మధ్య ఒప్పందం కుదిర్చాడని ఇటీవల గడ్కారీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే సాక్ష్యాధారాలతో ముందుకు రావాలని గడ్కారీకి ఆప్ సవాల్ విసిరింది.
సరైన సమయంలో వెల్లడిస్తా: గడ్కారీ
ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఒప్పందాన్ని కుదర్చిన పారిశ్రామికవేత్త పేరును సరైన సమయంలో వెల్లడిస్తానని బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ తెలిపారు. తగిన సమయంలో ఆ రహస్యాన్ని వెల్లడిస్తానని, దానికిది సరైన సమయం కాదని అన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరో ఢిల్లీ ప్రజలకు తెలుసని చెప్పారు. అయితే కాంగ్రెస్, ఆప్‌ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో గడ్కారీ ఎట్టకేలకు నోరు విప్పి పైవిధంగా సమాధానమిచ్చారు.
Advertisement