దావణగెరె, న్యూస్‌లైన్ : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు దావణగెరె సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరంలోని ప్రధాన రోడ్లు, సర్కిళ్లు బీజేపీ బంటింగ్స్, జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి. యావత్ నగరమంతా నమోమయంగా మారింది. నమో భారత్ సమావేశం జరిగే దావణగెరె నడిబొడ్డున ఉన్న ఉన్నత పాఠశాల మైదానంలో భారీ వేదికను నిర్మించారు. సమావేశానికి వచ్చే వారి కోసం సుమారు లక్షకు పైగా ఆసనాలు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే వేసవి ప్రారంభమైనందున సమావేశానికి వచ్చే కార్యకర్తలకు దాహర తీర్చేందుకు సుమారు 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 3 లక్షల మంచినీటి ప్యాకెట్లను సిద్ధం చేశారు. నగరంలో అలంకరించేందుకు 3.50 లక్షల టన్నుల బంటింగ్, వేలాది పార్టీ జెండాలను వినియోగించారు. నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు నాయకులు, మోడీ అభిమానులు వందలాది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ర్యాలీకి దావణగెరె, చిత్రదుర్గంతో పాటు ఇరుగు పొరుగు జిల్లాల నుంచి సుమారు 2.5 లక్షల మంది తరలి వస్తారని అంచనా వేశారు. ఇప్పటికే జనాన్ని సమీకరించేందుకు నమో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు బైక్ ర్యాలీలు, నమో టీస్టాల్స్ తదితర కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాక ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టడంతో భారీ సంఖ్యలో జనం తరలివస్తారని నేతలు చెబుతున్నారు.
హెలికాప్టర్‌లో నమో రాక :
హుబ్లీ నుంచి హెలికాప్టర్‌లో నగర శివార్లలోని జీఎంఐటీ హెలిప్యాడ్‌కు మంగళవారం ఉదయం 11 గంటలకు నరేంద్ర మోడీ చేరుకోనున్నారు. జీఎంఐటీ ఆవరణలో నిర్మించిన బీజేపీ సీనియర్ నాయకుడు దివంగత జీ.మల్లికార్జునప్ప ప్రతిమకు పూలమాల వేస్తారు. అనంతరం నూతనంగా నిర్మించిన జూనియర్ కాలేజీని ఆయన ప్రారంభిస్తారు. 11.30 గంటలకు సమావేశం జరిగే మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 కు మంగళూరుకు హెలికాప్టర్‌లో బయలుదేరి వెళతారు. నరేంద్ర మోడీ సమావేశంలో ఆయనతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి, మాజీ సీఎంలు యడ్యూరప్ప, సదానందగౌడ, జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప, ఎంపీలు అనంతకుమార్, జీఎం సిద్దేశ్వర్ తదితరులు పాల్గొననున్నారు.
గట్టి బందోబస్తు :
నరేంద్ర మోడీ రాక సందర్భంగా నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నగరం చుట్టుపక్కల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసు జాగిలాలు, సీసీ టీవీ కెమేరాలు ఏర్పాటు చేశారు.
దావణగెరెలో నమో సభకు సర్వం సిద్ధం
Published Tue, Feb 18 2014 1:42 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement