= నరేంద్ర మోడీ అని కాదు..
= గుజరాత్‌లో ఆయన చేసిన అభివృద్ధేమీ లేదు
= కాంగ్రెస్‌ను విమర్శించడమే బీజేపీ పని
= ‘భారతరత్న’కు వాజ్‌పేయి అనర్హుడు
= స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పాల్గొనలేదట
= రాష్ర్టంలో బీజేపీ నిర్వాకాలపై ప్రజలు విసుగెత్తారు
= అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు
= ఇప్పుడు మోడీని అడ్డుపెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు
= ‘మీట్ ది ప్రెస్’లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్
సాక్షి, బెంగళూరు : నమో అంటే అర్థం నరేంద్ర మోడీ అని కాదని, నర మేధం అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీకే హరిప్రసాద్ కొత్త నిర్వచనం ఇచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు అడిగే ధైర్యం రాష్ట్ర బీజేపీ నేతల్లో లేదని, అందుకే మోడీతో ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, బెంగళూరు రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మాట్లాడారు.
గుజరాత్ అభివృద్ధి పేరిట భారీ ప్రచారం చేస్తున్న నరేంద్ర మోడీ.. అసలు ఆ రాష్ర్టంలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ముఖ్యమంత్రి కాకముందు నుంచే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. మమతా బెనర్జీ తిరస్కరించిన ‘నానో ప్రాజెక్టు’ను తన రాష్ట్రానికి తీసుకురావడం ఒక్కటే మోడీ చేసిన పని అని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ నక్సల్స్‌తో కలిసి పనిచేస్తోందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు.
వాజ్‌పేయికి భారతరత్న ఇవ్వాలనే వాదనలపై హరిప్రసాద్ స్పందిస్తూ...‘ వాజ్‌పేయి స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నపుడు ఆయన్ను బ్రిటీష్ పోలీసులు అరెస్టు చేశారు. తనకు.. స్వాతంత్య్ర సంగ్రామానికి ఎలాంటి సంబంధం లేదని, తనను వదిలిపెట్టాలని వాజ్‌పేయి బ్రిటీష్ పోలీసులను కోరారు. ఇదంతా ‘ఫ్రంట్‌లైన్’ అనే మ్యాగజైన్‌లో కూడా ప్రచురితమైంది. మరి అలాంటి వ్యక్తికి భారతరత్నను ఇస్తే మిగతా స్వాతంత్య్ర పోరాటయోధులను అవమానించడమే అవుతుందనేది నా అభిప్రాయం’ అని అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ చేసిన నిర్వాకాలను భరించలేక ప్రజలు ఆ పార్టీని గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు. ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హయాంలో విధానసౌధలో అశ్లీల చిత్రాల వీక్షణ, రేవ్ పార్టీల గొడవ, అవినీతి తదితర వాటితో ప్రజలు విసిగిపోయే కాంగ్రెస్‌కు పట్టంగట్టారని పేర్కొన్నారు.
నమో అంటే నర మేధం
Published Sat, Nov 23 2013 2:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement