నేటి నుంచి సైన్స్ కాంగ్రెస్‌ | Narendra Modi to kick off 5 day annual Indian Science Congress | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సైన్స్ కాంగ్రెస్‌

Published Tue, Jan 3 2017 3:14 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

నేటి నుంచి సైన్స్ కాంగ్రెస్‌ - Sakshi

నేటి నుంచి సైన్స్ కాంగ్రెస్‌

►  తిరుపతి ఎస్వీయూలో  ప్రారంభించనున్న ప్రధాని
►నోబెల్‌ పురస్కార  గ్రహీతలతో భేటీ
► ఐదురోజుల పాటు సదస్సులు
► ఆకట్టుకుంటున్న  ‘ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’


తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రతిష్టాత్మక భారతీయ విజ్ఞాన సమ్మేళ నం (సైన్స్ కాంగ్రెస్‌)కు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి శనివారం వరకూ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాల యం ప్రాంగణంలో జరిగే ఈ 104వ సమ్మేళనాన్ని నేడు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. తర్వాత నోబెల్‌ పురస్కార గ్రహీతలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, గవర్నర్‌ నరసింహన్, కేంద్ర, రాష్ట్రమంత్రులు హాజరవుతున్నారు. కార్యక్రమం అనంతరం ప్రధాని తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. స్వల్ప విశ్రాంతి తర్వాత తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని రాక సందర్భంగా తిరుమల ఆలయంలో మంగళవారం వీఐపీ దర్శనం రద్దు చేశారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా ఉత్తరాది వంటకాలు సిద్ధం చేశారు.

ఎస్వీయూలో సైంటిస్ట్‌ల సందడి..
సైన్స్ కాంగ్రెస్‌ నిర్వహించే శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఎటుచూసినా శాస్త్రవేత్తలతో కళకళలాడుతోంది. నోబెల్‌ పురస్కార గ్రహీతలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, యంగ్‌ అచీవర్‌ అవార్డు విజేతలు, ప్రతిభా అవార్డులను గెల్చుకున్న విద్యార్థులు వర్సిటీ ప్రాంగణంలో సందడి చేస్తున్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక, పరిశోధనా రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులతో ఎస్వీయూ క్యాంపస్‌ కొత్త రూపును సంతరించుకుంది. ఎస్వీయూ క్యాంపస్‌లో ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా పేరిట ఏర్పాటు చేసిన మెగా సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులు, సందర్శకులను ఆకట్టుకుంటోంది. డీఆర్‌డీవో, ఐఎస్‌ఎస్‌ఆర్, ఇస్రో, షార్‌లతో పాటు హెచ్‌ఏఎల్, బీడీఎల్, వంటి భారత ప్రభుత్వ రంగ సంస్థల తయారీ ఎగ్జిబిట్లు తరలి వచ్చాయి. వ్యవసాయ, ఉద్యాన, ఫిషరీస్, డెయిరీ రంగాల్లో సాధించిన పురోగతిని తెలియజేసే టెక్నాలజీని కూడా అందుబాటులో ఉంచారు.

ఢిల్లీ నుంచే నిఘా
దేశ విదేశీ ప్రముఖులు హాజరవుతున్న విజ్ఞాన సమ్మేళనానికి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఇంటిలిజెన్ప్ బ్యూరో (ఐబీ) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిరుపతి పట్టణాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం అత్యంత వేగంతో పనిచేసే ఇంటర్నెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఐబీ సీనియర్‌ అధికారి ఒకరు సాక్షికి తెలిపారు. ప్రధాన ప్రాంతాల్లో హై ఫ్రీక్వెన్సీ జూమ్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని ఢిల్లీలోని ఐబీ కార్యాలయానికి అనుసంధానం చేశామని, ఒక్కో కెమెరా రెండు కిలోమీటర్ల పరిధిని గమనిస్తుందని అధికారులు తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల ఆధార్, ఇతర ఫోటో గుర్తింపు కార్డులను నిఘా విభాగం సాఫ్ట్‌వేర్‌కు లింక్‌ చేశారు. దాదాపు 6,500 మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగిస్తున్నారు.

కేంద్ర నిఘా వర్గాల సూచనలను పాటిస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని రాయలసీమ రేంజ్‌ ఐజీ శ్రీధర్‌రావు తెలిపారు. డీఐజీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో అర్బన్  ఎస్పీ జయలక్ష్మి, ఇద్దరు ఐపీఎస్‌లు, 30 మంది డీఎస్పీలు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇక తిరుపతిలోని స్టార్‌హోటళ్లన్నీసైన్స్ కాంగ్రెస్‌ ప్రతినిధులు, సందర్శకులతో కిటకిటలా డుతున్నాయి.

స్వదేశీ పరిజ్ఞానమే ప్రధానం
స్వదేశీ పరిజ్ఞానాన్ని మరింత మెరుగు పర్చుకునే దృఢ సంకల్పంతో భారత్‌ ముందడుగు వేస్తోంది. దీనికోసం ఇండి యన్ న్స్ కాంగ్రెస్‌ అసోసియేషన్ కృషిచేస్తోంది. 1914లో కల కత్తా కేంద్రంగా ఇండియన్ సైన్స్  కాంగ్రెస్‌ అసోసియేషన్ ప్రారం భమైంది. ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరిశోధనా రంగాల్లో సాధించిన పురోగతిని పరస్ప రం సమీక్షించుకునేలా ఏర్పాట్లు చేసింది. 2013లో శత వసంతాల వేడుకను కోల్‌ కతాలోనే నిర్వహించారు. గత సమ్మేళ నాన్ని మైసూర్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే.

ప్రత్యేకతలివీ...

♦ ఈసారి సదస్సుకు 12,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
♦ మొత్తం 32 ప్లీనరీలు, సబ్‌ సెక్షన్స్ 
♦ 1,100 మంది వలంటీర్లు సేవలందించేందుకు సిద్ధమయ్యారు.
♦ ఈఏడాది శిశు, మహిళా కాంగ్రెస్‌ సదస్సులనూ నిర్వహిస్తున్నారు.
♦ ఏడెకరాల్లో భారీ సైన్స్  ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.
♦ ప్రతినిధులందరికీ టూరిజం శాఖ పర్యాటక ప్రదేశాలను చూపిస్తుంది.
♦ సైన్స్  టెక్నాలజీ రంగాల్లో నిష్ణాతులైన వారిని సత్కరించనున్నారు.

హాజరవుతున్న నోబెల్‌  గ్రహీతలు...
1. ప్రొ.విలియం ఈమోర్నర్‌(యూఎస్‌ఏ)
2. ప్రొ.టకాకి కజిత (జపాన్)
3. ప్రొ.సెర్జ్‌ హరోచి (ఫ్రాన్స్)
4. ప్రొ.జీన్  టిరోలి (ఫ్రాన్స్ )
5. ప్రొ.అడా ఇ యెనాత్‌ (ఇజ్రాయెల్‌)
6. ప్రొ.మహ్మద్‌ యూనస్‌ (బంగ్లాదేశ్‌)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement