ఈసీకి రోశయ్య కితాబు | national voter's day celebrations Konijeti Rosaiah | Sakshi
Sakshi News home page

ఈసీకి రోశయ్య కితాబు

Published Mon, Jan 26 2015 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

national voter's day celebrations Konijeti Rosaiah

 సాక్షి, చెన్నై : ప్రజా స్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడం లక్ష్యంగా  నిబద్దతతో భారత ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలు అభిన ందనీయమని రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రశంసించారు. ఆదివారం రాజ్ భవన్‌లో ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీకి రోశయ్య శ్రీకారం చుట్టారు. ఉత్తమ సేవల్ని అందించిన అధికారుల్ని సత్కరించారు.
 
  జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునే విధంగా రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు విశేష స్పందన వచ్చింది. కొత్త ఓటర్ల చేరికతో రాష్ట్రంలో గత ఏడాది కంటే, తాజాగా ఓటర్ల సంఖ్య 17 లక్షలు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5.62 కోట్ల మంది, చెన్నైలో 38 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు  ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కొత్తగా చేరిన 17 లక్షల ఓటర్లకు గుర్తింపు కార్డుల్ని సిద్ధం చేసిన అధికారులు ఆదివారం నుంచి పంపిణీకి శ్రీకారం చుట్టారు.
 
 ఘనంగా ఓటర్ల దినోత్సవం
 ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుర్తింపు కార్డుల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం అన్ని  జిల్లా కేంద్రాల్లోని ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఓటర్ల దినోత్సవాలు నిర్వహించారు. ఓటు హక్కు వినియోగం, ఓటుకు నోటు స్వీకరించ వద్దన్న నినాదాలతో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. చెన్నైలోని రాజ్ భవన్‌లో జరిగిన వేడుకలో గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
 
 అనంతరం అన్ని జిల్లా కేంద్రాల్లో కొత్త ఓటర్లకు గుర్తింపుకార్డుల పంపిణీ ప్రక్రియను చేపట్టారు. ఎన్నికల నిర్వహణలో, అవగాహన కార్యక్రమాలు విస్తృత పరచడంలో విశిష్ట సేవల్ని అందించిన అధికారుల్ని రోశయ్య సత్కరించారు. ఈ వేడుకలో గవర్నర్ రోశయ్య ప్రసంగిస్తూ, గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలు, గాంధీ జయంతిలను జరుపుకునే రీతిలో ప్రతి ఏటా జనవరి 25న ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం హర్షణీయమన్నారు. భారత ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు అభినందనీయమని కితాబు ఇచ్చారు. ఓటర్లకు వారి హక్కును తెలియజేయడంతో పాటుగా, ప్రజా స్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కొనియూడారు.
 
 పపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో స్వతంత్రంగా ఎన్నికల కమిషన్ తన నిర్ణయాల్ని అమలు చేస్తూ, పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేస్తూ, ముందుకు దూసుకెళ్తోందని గుర్తు చేశారు. తాజాగా 17 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని, ఇందులో ఆరు లక్షల మంది యువ ఓటర్లు ఉండడం అభినందనీయమన్నారు. ఓటర్లలో చైతన్యం వస్తోందంటే, అందుకు ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలే కారణమంటూ కితాబు ఇచ్చారు. ఈ వేడుకలో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సందీప్ సక్సేనా, రాష్ట్ర ఎన్నికల అధికారి అయ్యర్, సీనియర్ ఐఏఎస్‌లు రమేష్ చంద్ మీనా, సుందర వల్లి, టీజీ వినయ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement