
బీజేపీ జాతీయవాద పార్టీ... కానీ ఆప్ అలా కాదు..!
దేశభక్తి కలిగిన కార్యకర్తలున్న జాతీయవాద పార్టీ బీజేపీ ఒక్కటేనని పేర్కొన్న ఆర్మీ మాజీ చీఫ్ వి.కె. సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీని జాతి వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు.
న్యూఢిల్లీ: దేశభక్తి కలిగిన కార్యకర్తలున్న జాతీయవాద పార్టీ బీజేపీ ఒక్కటేనని పేర్కొన్న ఆర్మీ మాజీ చీఫ్ వి.కె. సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీని జాతి వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు. అలాంటివారిని దేశం ఎన్నటికీ క్షమించదన్నారు. ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సింగ్ గురువారం ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... ‘కాశ్మీర్ నియంత్రణ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా మార్చాలని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. కాశ్మీర్‌పై రెఫరెండాన్ని ఆ పార్టీ సమర్థిస్తోంది. ఇలాంటి జాతి వ్యతిరేక పార్టీని, ఆ పార్టీ నేతలను దేశం ఎన్నటికీ క్షమించ దు. భారతీయ జనతా పార్టీ మాత్రమే జాతీయవాద పార్టీ. దేశభక్తి కలిగిన పౌరుడిగా, క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో నాకు ప్రత్యర్థులెవరూ లేరని నేను భావిస్తున్నాను. పేదరికం, సామాజిక సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చాను.
ఇన్నాళ్లూ ఘజియాబాద్ నగరంపై పాలకులు సవతి తల్లి ప్రేమ కనబర్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ నగరాన్ని చిన్నచూపుతో చూసింది. సైన్యానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మీకు తెలుసా.. ఘజియాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న రాజ్ బబ్బర్ రక్షణకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడు.
ఆయనకు ఆర్మీ గురించి కనీసం ఏబీసీడీ కూడా తెలియదు. బీజేపీని గెలిపిస్తే కనీస మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తానని హామీ ఇస్తున్నాను. నగరం అభివృద్ధే నా ధ్యేయం. అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరి ష్కారానికి కృషి చేస్తా. శాంతిభద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తా. ఇప్పటికీ దేశ భద్రతకు సంబంధించి విధు లు నిర్వర్తిస్తూనే ఉన్నాను. ఎన్నికల్లో గెలిస్తే దేశ ప్రజ ల గురించి, వారి బాగోగుల గురించి ఆలోచిస్తా. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా’నన్నారు.