సఖ్యత సాధ్యమేనా?
సాక్షి ముంబై: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకమే కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య మాటలయుద్ధానికి కారణమని రాజకీయ నిపుణులు విశ్లేస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే తమ బలం పెరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది. కాబట్టి తమకు 29 సీట్లు కావాలని ఎన్సీపీకి 19 సీట్లు కేటాయిస్తామని ప్రతిపాదిస్తోంది. మరోవైపు ఎన్సీపీ ముందు నుంచి పాత ఫార్ములా.. అంటే కాంగ్రెస్ 26, ఎన్సీపీ 22 సీట్లలో పోటీ చేయాలని చెబుతోంది. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఇటీవలే ఎన్నికైన శరద్ పవార్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించడంతో ఆ పార్టీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ లక్ష్యంగా ఎన్సీపీ విమర్శలు గుప్పిస్తోంది.
మరోవైపు తాజాగా వీరికి కాంగ్రెస్ మంత్రులూ తోడయ్యారు. దీంతో ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉప-ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌తోపాటు మొత్తం రాష్ట్ర మంత్రి మండలి ఒక్కటైనట్టు తెలుస్తోంది. ముఖ్యమైన ఫైళ్లు తరచూ ఆలస్యం కావడంపై బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయింది. దీనికి ముఖ్యమంత్రే బాధ్యుడంటూ అంతా ముక్తకంఠంతో నిందించడంతో ఆయన ఇబ్బందికి గురయ్యారు. పరిస్థితి ఇలాగే కొనసాగినట్టయితే ప్రభుత్వం నుంచి విడిపోయి బయటి నుంచి మద్దతు ఇవ్వడం బాగుంటుందని అజిత్‌పవార్ తన సన్నిహితులతో అన్నట్టు ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సంఘటనలను పరిశీలిస్తే కాంగ్రెస్, ఎన్సీపీ ‘మైండ్‌గేమ్’ ఆడుతున్నట్టు భావిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఒత్తిడి పెంచుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని సీట్లు అధికంగా డిమాండ్ చేసేందుకు ఎన్సీపీ ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా 29 సీట్లను దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందిస్తూ తమ పార్టీ 22 స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు ఆచితూచి పావులు కదుపుతోంది. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా మారిన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం యథావిధిగా తమకు 29 సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు మరింత ముదురుతాయని అంచనా. సీట్ల పంపకాలపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ కాంగ్రెస్ అధిష్టానం మధ్య జరిగే చర్చల ఫలితాలపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమయింది. మద్దతు ఉపసంహరించుకోం: ఎన్సీపీ
ఫైళ్ల ఆమోదంలో జాప్యానికి నిరసన ప్రభుత్వం నుంచి వైదొలిగి బయటి నుంచి మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అజిత్ పవార్ అన్నారంటూ వచ్చిన వార్తలపై ఎన్సీపీ గురువారం స్పందించింది. తమకు ఫైళ్ల ఆమోదం త్వరగా జరగడం ముఖ్యమేనని, అయితే మద్దతు ఉపసంహరించుకునే ఆలోచన లేదని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీపైనా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. కొందరు కార్పొరేటర్ల సాయంతో ఆయన గుజరాత్‌ను దోచుకుంటున్నారని ఆరోపించారు. ముంబైలో మోడీ నిర్వహించిన ర్యాలీకి రూ.25 కోట్లు ఖర్చయిందని, ముఖ్యమంత్రి కాకపోతే ఆయన ఇంత ఖర్చు చేయగలరా అని మాలిక్ ప్రశ్నించారు. ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే మోడీ తన ముఖ్యమంత్రి పదవిని వదిలేసి ఉండాల్సిందన్న ఎమ్మెన్నెస్ అధిపతి రాజ్‌ఠాక్రే వ్యాఖ్యలపై మాలిక్ స్పందిస్తూ ‘ఆయన అలా ఎన్నటికీ చేయరు’ అని స్పష్టం చేశారు.