సాక్షి, ముంబై: దేశంలో ఇక కాంగ్రెస్ పాలనకు నూకలు చెల్లాయి.. ఢిల్లీలో లాల్ ఖిల్లాపై యూపీఏ ప్రధాని మన్మోహన్‌సింగ్ జెండా ఎగురవేయడం ఇదే చివరిసారి అవుతుంది.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మనం.. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయం’ అని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే జోస్యం చెప్పారు. శివసేన అధినేత బాల్ ఠాక్రే ద్వితీయ జయంతిని పురస్కరించుకుని సైన్‌లోని సోమయ్య గ్రౌండ్‌లో గురువారం మధ్యాహ్నం ‘ప్రతిజ్ఞా దివస్’ నినాదంతో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన లక్షలాది శివసైనికులు, పార్టీ పదాధికారులనుద్దేశించి ఉద్ధవ్ ప్రసంగించారు. ‘మన అసమర్థ, బలహీన ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లాల్ ఖిల్లాపై జెండా ఎగురవేయడం, ప్రసంగించడం ఇదే చివరిసారి కానుంది.
వచ్చే ఏడాది ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయం, లాల్ ఖిల్లాపై ఎన్డీయే ప్రధాని మువ్వన్నెల జెండా రెపరెపలాడిస్తారు.. రాష్ట్రంలో కూడా మన పార్టీయే అధికారంలోకి వస్తుంది.. ఇక్కడా మనమే జెండా ఎగురవేస్తాం..’ అని ధీమా వ్యక్తం చేశారు. ‘మన ప్రధానికి విదేశాల్లో ఎలాగూ గుర్తింపు, విలువ, గౌరవం లేదు. స్వదేశంలో, కనీసం కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనను గౌరవించడం మానేశారని ఎద్దేవా చేశారు. ప్రధాని పనితీరు ‘అపరేషన్ సక్సెస్ కాని పేషంట్ డెడ్’ అన్న చందంగా ఉందని దుయ్యబట్టారు.‘కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను పేదలుగానే ఉంచింది. వారి అసమర్ధ పాలన వల్ల చుక్కలను తాకిన నిత్యావసర సరుకుల ధరలు పేదల పాలిట శాపంగా మారాయి. స్వాతంత్య్ర కాలం నాటి కాంగ్రెస్ ఇప్పుడు లేదని, నాయకులంత అవినీతిలో కూరుకుపోయారు.. ఆదర్శ్ దర్యాప్తు కేవలం నాటకీయంగా సాగింద’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బలమైన నాయకులు ఉండాల్సిన అవసరం ఎంత్తైనా ఉందని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలకు ఉద్ధవ్ సమాధానమిస్తూ.. ‘నిజమే..ఇప్పుడు అక్కడ ఉన్నది అంతా బలహీనులే..’ అని ఎద్దేవా చేశారు. ‘మీరు కూడా అక్కడే ఉన్నారు.. మీరేం చేస్తున్నార’ని ప్రశ్నించారు.
అలాగే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీపై, విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై కూడా ఘాటుగా ఆరోపణలు చేశారు. ‘బలప్రదర్శన చేసేందుకు ఇది రాజకీయ ర్యాలీ కాదు.. వీరందరూ కేవలం బాల్ ఠాక్రేపై ఉన్న అభిమానంతో ప్రతిజ్ఞ దివస్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన జనమ’ని పేర్కొన్నారు. బాల్ ఠాక్రే పుట్టిన రోజును గుర్తుచేస్తూ ‘గతంలో ఈ రోజున వేలాది మంది శివసైనికులు మాతోశ్రీ బంగ్లాకు తరలివచ్చేవారు. ఆయన దర్శనం, ఆశీర్వాదం కోసం ఎంతో అతృతతో ఎదురుచూసేవారు. దర్శనం కాగానే ఎంతో ఉత్సాహంతో వెనుదిరిగేవారు. శివసైనికులే నాకు టానిక్, టానిక్ లేకుండా తను బతకలేనని తరుచూ బాల్‌ఠాక్రే అంటుండేవారు.. ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను.. ఈ శక్తి, ప్రత్యర్థులను ఎదుర్కునే ధైర్యం నాదికాదు.. అంతా మీరిచ్చిన బలమే’నని అన్నారు.
హిందువునని చెప్పుకోవడానికి తను ఎంతో గర్వపడుతున్నానని, ఈ రోజును ఇక నుంచి ‘శివబంధన్ దివస్’గా జరుపుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తన ప్రసంగం చివరలో మాతా తుల్జాభవాని మందిరంలో పూజలు చేయించి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కంకణం (దారం) కార్యకర్తలందరికీ పంపిణీ చేశారు. అనంతరం వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. దాని నిమిత్తం బాల్ ఠాక్రే బతికుండగా అప్పట్లో శివసైనికులతో చేయించిన ప్రతిజ్ఞ సీడీని ప్లే చేశారు. అంతకుముందు మేయర్ సునీల్ ప్రభు కొద్ది సేపు ప్రసంగించి శివసైనికులను ఉత్తేజ పరిచారు. సునీల్ ప్రసంగం అనంతరం వేదికపైకి వచ్చిన ఉద్ధవ్ తొలుత శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత పార్టీ, ఇతర రంగాల పదాధికారులు ఉద్ధవ్‌కు గజమాల వేసి, కరవాలం ప్రదానం చేసి సన్మానించారు.
ట్రాఫిక్ జాం..
శివసేన ప్రతిజ్ఞ దివస్ సందర్భంగా భారీగా తరలివచ్చిన జనం కారణంగా ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇటు సైన్ నుంచి విక్రోలి వరకు, అటూ మాన్‌ఖుర్ద్ వరకు రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది బస్సులు, టెంపోలు, టాటా సుమోలు ఒక్కసారిగా నగరం దిశగా రావడంతో ముంబై-పుణే, ముంబై-నాసిక్ జాతీయ రహదారులపై విపరీతమైన ట్రాఫిక్ భారం పడింది. పోలీసులు ఎప్పటికప్పుడు వాహనాలను క్రమబద్ధీకరించినా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతూనే ఉంది.
జయం మనదే
Published Thu, Jan 23 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
Advertisement