చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రజలు పడుతున్న పాట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు రెండురోజుల క్రితం దేశరాజధాని చేరుకున్న డీఎండీకే బృందం ఢిల్లీలోనే తిష్టవేసింది. పొత్తులపై ఒక అవగాహన వచ్చేందుకే కెప్టెన్ వేచి వున్నారనే ప్రచారం సాగుతోంది.కాంగ్రెస్, బీజేపీ, డీఎంకే ఈ మూడు పార్టీలూ డీఎండీకేతో పొత్తుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. చర్చలతో బీజేపీ చాలాదూరం వెళ్లి వెనక్కువచ్చింది. డీఎంకే మూడు అడుగులు ముందుకు నడిచి, నాలుగు అడుగులు వెనక్కివేసింది. ఇదే అదనుగా మద్యలో దూరిన కాంగ్రెస్ తన ప్రయత్నాలను ప్రారంభించింది. సీట్ల కోసం బీజేపీతో బేరసారాలతో పరిమితమై మరే పార్టీకి పొత్తుపై మాటివ్వని విజయకాంత్ అకస్మాత్తుగా ఢిల్లీ పయనమయ్యారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న కావేరీ, ముల్లైపెరియార్, శ్రీలంక- తమిళ జాలర్ల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడమే తన డిల్లీ పర్యటన ధ్యేయం అని విజయకాంత్ వివరణ ఇచ్చారు. అయితే ఆయన వివరణను ఎవ్వరూ నమ్మడం లేదు.
పొత్తులపై ఆయా పార్టీల అధిష్టానంతోనే అమీతుమీ తేల్చుకోవానే ఉద్దేశంతోనే వెళ్లారని ప్రచారం సాగుతోంది. పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు వెంటరాగా సతీమణి ప్రేమలత, బావమరిది సతీష్ కలిసి ఈనెల 13న డిల్లీకి చేరుకుని, 14 వ తేదీన ప్రధానిని కలవడం పూర్తయిన తరువాత ఇంకా అక్కడేమి పని అంటూ చెవులుకొరుక్కుంటున్నారు. విజయకాంత్, ప్రేమలత, సతీష్‌లు డిల్లీలోని ఒక హోటల్‌లోనూ, 20 మంది ఎమ్మెల్యేలు తమిళనాడు భవన్‌లోనూ బసచేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌లను కలుసుకునేందుకే కెప్టెన్ డిల్లీలో వేచిఉన్నారని రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. అయితే డీఎండీకే పార్టీ ప్రముఖుడు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టివేస్తూ ప్రధానికి సమర్పించిన వినతిని కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలకు కూడా ఇచ్చేందుకే ఢిల్లీలో ఉన్నామని బదులిచ్చారు. అయితే ఈనెల 16న విజయకాంత్ చెన్నై చేరుకుంటారని అంటున్నారు.
అంతా డ్రామా: రెబల్ ఎమ్మెల్యేలు
కెప్టెన్ డిల్లీ పర్యటనంతా ఒక డ్రామా అని, అదే పార్టీకి చెందిన ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు శనివారం మీడి యా వద్ద కొట్టిపారేశారు. ప్రధాని వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలపై ఆయన రాష్ట్రంలో ఎందుకు ఆందోళనలు జరపలేదని ఎమ్మెల్యే మైకేల్‌రాయప్పన్ ప్రశ్నించారు. పొత్తులపై తన గిరాకీని పెంచుకునేందు కు అన్ని పార్టీల అధినేతలతో కలవడం కోసమే డిల్లీ డ్రామా ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెప్టెన్ సీఎం అయితేగానీ రాష్ట్ర సమస్యలు పరిష్కారం కావని ప్రధాని తనతో అన్నట్లుగా ఢిల్లీ మీడియా వద్ద విజయకాంత్ చెప్పుకోవడం పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో డీఎండీకే తిష్ట
Published Sun, Feb 16 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM
Advertisement
Advertisement