నైట్‌లైఫ్ వద్దు
- నగరంలో శాంతిభద్రతలు లోపిస్తున్నాయని పోలీసుల ఆందోళన
- పునరాలోచనలో ప్రభుత్వం
బెంగళూరు : నగరంలో నైట్ లైఫ్ విస్తరణకు ఆరు నెలల కిందట అయిష్టంగానే ఒప్పుకున్న పోలీసులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. గత శుక్రవారం ఓ పీజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరపడంతో తాము భయపడినంతా జరిగిందని సీనియర్ పోలీసు అధికారులు వాపోతున్నారు. నగరంలో సాధారణంగా బార్లు, రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసివేసే వారు. అయితే నగరంలో నైట్ లైఫ్ అనేదే లేకుండా పోయిందని, దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా నైట్ లైఫ్ ఉందని పలువురు వాదిస్తూ వచ్చారు.
తర్జన భర్జన అనంతరం గత డిసెంబరులో ప్రభుత్వం నైట్ లైఫ్‌కు అనుమతినిచ్చింది. దీని ప్రకారం...బార్లు, మద్యం షాపులు శుక్ర, శనివారాల్లో రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచుతారు. రెస్టారెంట్లు, హోటళ్లు వారమంతా ఒంటి గంట వరకు వ్యాపారం చేసుకునే అవకాశాలున్నాయి. బార్లు, మద్యం షాపులను రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం వద్ద పోలీసు శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది, సుదీర్ఘ మంతనాల అనంతరం ఆరు నెలల ప్రయోగాత్మక నైట్ లైఫ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత జూన్‌లో మరో ఏడాదికి విస్తరించింది. పీజీ విద్యార్థినిపై శుక్రవారం అర్ధ రాత్రి దాటాక సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో నైట్ లైఫ్‌కు మంగళం పాడేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని సీనియర్ పోలీసు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మరో వైపు ప్రభుత్వం కూడా నైట్ లైఫ్‌పై తన నిర్ణయం సమంజసమేనా అన్న పునరాలోచనలో పడింది. ప్రధానంగా సిబ్బంది కొరత కారణంగా నైట్ లైఫ్‌ను పోలీసు అధికారులు వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వ ఆదేశాల కారణంగా హోం గార్డులతో శాంతి భద్రతలను పర్యవేక్షించాలని నిర్ణయించారు. సున్నితమైన చోట్ల హోం గార్డులకు తోడు పోలీసులను కూడా నియమిస్తున్నారు.
వద్దు...మహాప్రభో
నైట్ లైఫ్‌ను కొనసాగిస్తే తమ పనై పోతుందని నగర పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సిబ్బంది కొరత ఉన్నందున, వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న వారిని వీకెండ్ సందర్భాల్లో బార్ అండ్ రెస్టారెంట్‌ల వద్ద భద్ర త కోసం నియమిస్తున్నామని బెంగళూరు నగర అదనపు పోలీసు కమిషనర్ కమల్ పంత్ చెబుతున్నారు. బెంగళూరులో 40కి పైగా యువతులు పని చేసే బార్ అండ్ రెస్టారెంట్‌లు ఉన్నాయి. వారికి ఆయా యాజమాన్యాలు ప్రైవేట్ భద్రతను కల్పిస్తున్నాయి. మద్యం మత్తులో ఎవరు, ఏ క్షణంలో ఎలా ప్రవరిస్తారో తెలియదు కదా...అనేది పోలీసుల అభిప్రాయం
అప్పుడే వారించిన కమిషనర్
నగరంలో నైట్ లైఫ్ వల్ల లేని పోని సమస్యలు వస్తాయని గతంలో నగర పోలీసు అధికారిగా పని చేసిన నీలం అచ్చుతరావు హెచ్చరించారు. తన హయాంలో నైట్ లైఫ్‌ను ప్రవేశ పెట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నిటినీ ఆయన అడ్డుకున్నారు. బార్లలో యువతలు, పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేసే ‘లైవ్ బ్యాండ్’ను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకానొక సందర్భంలో ఆయనపై ఒత్తిడి వచ్చినప్పుడు, తనను బదిలీ చేసి వాటిని ప్రవేశ పెట్టవచ్చని కరాఖండిగా చెప్పారు. తదుపరి కమిషనర్ శంకరి బిదరి సైతం నైట్ లైఫ్ వల్ల నగరంలో ఏర్పడే దుష్పరిణామాలను వివరిస్తూ, అది వద్దే వద్దని పట్టుబట్టారు.