సాక్షి, ముంబై:
పోలీసు సిబ్బంది తమ వ్యక్తిగత వాహనాల మీద ‘పోలీస్’ స్టిక్కర్లు అంటించవద్దని పోలీస్ కమీషనరు సత్యపాల్ సింగ్ ఇటీవల సర్క్యులర్‌ను జారీ చేశారు. నియమాన్ని ఉల్లంఘించిన పోలీసు సిబ్బందికి రూ. 100 జరిమానా విధించడమే కాకుండా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కమిషనర్ అక్టోబర్‌లో జారీ చేసిన సర్క్యులర్ అమలవుతున్న జాడమాత్రం కనిపించడం లేదు. చాలా ద్విచక్రవాహనాలపై ఇప్పటికీ ఈ స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి.
ఈ సందర్భంగా డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ప్రతాప్ దిగావార్కర్‌ను ప్రశ్నించగా ఆదేశాలు జారీ అయిన వెంటనే చాలా మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు స్టిక్కర్లను తొలగించారు. సిబ్బంది స్పందన సానుకూలంగానే ఉందని తెలిపారు. ఎవరైనా నియమాలను ఉల్లంఘించి స్టిక్కర్లను ఉపయోగిస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.100 జరిమానా కూడా విధించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఉగ్రవాదులు పోలీస్ స్టిక్కర్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఈ స్టిక్కర్లను అంటించుకొని రక్షిత ప్రదేశాలలోకి చొరబడే అవకాశం ఉంది.
పోలీస్ స్టిక్కర్ ఉన్న వాహనాలను కాపలా విధులను నిర్వహించే వారు అరుదుగా తనిఖీ చేస్తుంటారు. దీన్ని అవకాశంగా ఉగ్రవాదులు ఈ స్టిక్కర్‌ను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. చట్ట ప్రకారం స్థానిక ఆర్టీవోలో వాహనాన్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత మార్పులు చేయకూడదు. వాహనంలో ఎలాంటి మార్పులు చేయదల్చుకున్నా ఆర్టీవో అధికారులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది’’ అని వివరించారు.
వ్యక్తిగత వాహనాలపై పోలీస్ స్టిక్కర్ వద్దు
Published Mon, Dec 16 2013 11:28 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement