సాక్షి, ముంబై: బాంద్రా-వర్లీ సీలింక్ భద్రత గాల్లోని దీపం మాదిరిగానే ఉంది. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఈ ప్రాజెక్ట్ ఉన్నా అధికారులు భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ సీలింక్ వంతెన మీద పేలుడు పదార్థాల డిటెక్టర్లను అమర్చే కాం ట్రాక్ట్‌ను రెండేళ్ల క్రితం దక్కించుకున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇప్పటివరకు ఆ పనిని పూర్తి చెయ్యలేకపోయింది. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోనే డిటెక్టర్లను అమర్చే పనులు ముగించాల్సి ఉండగా, ఏళ్లు గడుస్తున్నా ముందుకు కదలడం లేదు.
దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) రూ.24 కోట్ల వ్యయంతో కూడిన ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. ఈ విషయమై ఎమ్మెస్సార్డీసీ చీఫ్ ఇంజినీర్ అరుణ్ డియోధర్ మాట్లాడుతూ.. ఈ కాంట్రాక్ట్‌ను నెల క్రితమే రద్దు చేశామన్నారు. అయితే 2012 సెప్టెంబర్‌లో కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు డిటెక్టర్లను ఆరు నెలల్లోపు అమర్చాలని గడువు విధించామన్నారు.
అప్పటివరకు పూర్తి కాకపోవడంతో మరో రెండుసార్లు కాంట్రాక్ట్‌ను పొడిగించామని తెలిపా రు. అయితే ఒప్పందం కుదుర్చుకొని 18 నెలలు పూర్తయినా ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో కాంట్రాక్ట్‌ను రద్దు చేశామన్నారు. ఈ ప్రదేశంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేసేందుకు పోలీ సులతో పాటు ఇతర భద్రతా ఏజెన్సీల సలహాలను కూడా తీసుకొని ఓ పట్టికను రూపొందిస్తున్నామని తెలిపారు. పేలుడు పదార్థాలను కనిపెట్టే డిటెక్టర్లు, సీసీటీవీ కెమెరాలను కూడా ఇరు వైపులా అమరుస్తామన్నారు. 5.6 కి.మీ.మేర ఉన్న ఈ బాంద్రా-వర్లీ సీలింక్ వద్ద పైన, కింది భాగాల వద్ద ఆరు సీసీటీవీ కెమెరాలను అమర్చామని తెలిపారు. అయితే భద్రతను మరింత పెంచేందుకు కొత్త టెం డర్లను ఆహ్వానిస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఆరు నెలల సమయం తీసుకుంటుం దని వివరించారు.
భద్రత అవసరం...
సీలింక్‌ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 2008లో నగరంలో ఉగ్రవాదుల దాడి తర్వాత అప్పటి నగర పోలీస్ కమిషనర్ డి.శివానందన్ అత్యాధునిక పరికరాలతో భద్రతను కట్టుదిట్టం చేయమని ఎమ్మెస్సార్డీసీకి ఓ లేఖ కూడా రాశారని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రదేశం ఉగ్రవాదుల హిట్‌లిస్టులో కూడా ఉందని అంటున్నారు. భద్రతను కట్టుదిట్టం చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బాంద్రా-వర్లీ సీలింక్‌కు భద్రతేదీ?
Published Mon, Apr 7 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM
Advertisement
Advertisement