
జప్తు నోటీసులు షురూ
రాజధాని నగరంలోని మాల్స్, వాణిజ్య కేంద్రాల్లోని ఐదు వేలకు పైగా దుకాణాలు కార్పొరేషన్‌కు రూ.66 కోట్ల మేరకు బకాయి పడ్డాయి. దీనిని ముక్కు పిండి వసూలు చేయడానికి కార్పొరేషన్ వర్గాలు సిద్ధమయ్యాయి. ఆయా దుకాణాల జప్తుకు గురువారం నోటీసులు జారీ అయ్యాయి. ఆయా దుకాణాల ముందు అధికారులు దండోరా వేసి మరీ హెచ్చరించారు.
సాక్షి, చెన్నై: చెన్నై మహానగర కార్పొరేషన్ పరిధిలోని 15 మండల్లాల్లో ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా మండల పరిధిలో సొంత ఇళ్లు కలిగిన వాళ్లు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. అయితే స్టార్ హోటళ్లు, అతి పెద్ద కార్యాలయాలు కొన్ని ఆస్తి పన్ను చెల్లింపులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి. దీంతో ఆయా మాల్స్, స్టార్ హోటళ్ల ముందు వారి పరువు బజారుకీడ్చే రీతిలో దండోరా వేసి మరీ బకాయి వివరాల్ని ప్రకటించి, చెల్లింపునకు గడువు ఇచ్చారు. దీంతో కొన్ని హోటళ్లు, మాల్స్ యాజమాన్యాలు పన్ను చెల్లింపునకు పరుగులు తీశాయి. అదే పద్ధతిని కాస్త భిన్నంగా అమలు చేసి మాల్స్, వాణిజ్య కేంద్రాల్లోని దుకాణాల భరతం పట్టేందుకు కార్పొరేషన్ యంత్రాంగం నిర్ణయించింది. నగరంలో ఐదు వేలకు పైగా దుకాణాలు ఆస్తి పన్ను బకాయి పడ్డట్టు అధికారులు గుర్తించారు. ఈ బకాయి రూ.66 కోట్ల మేరకు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. దీనిని ఆయా దుకాణదారుల నుంచి వసూలు చేయడానికి సిద్ధమయ్యారు.
ఇది వరకు దండోరాతో స్టార్ హోటళ్లు, మాల్స్ యజమానుల పరువు బజారు కీడ్చే పనిలో పడ్డ అధికారులు, తాజాగా జప్తు నోటీసుతో ఆయా దుకాణాల ముందు గురువారం వాలారు. తొలి విడతగా ఆయా మండలాల పరిధిలోని ఐదు వేల దుకాణాల ముందు ఉదయాన్నే తిష్ట వేశారు. దుకాణాలు తెరవగానే, జప్తు నోటీసుల్ని అంటించారు. దాన్ని ఫొటో తీశారు. కాసేపటికి ఆ జప్తు నోటీసులోని వివరాల్ని, బకాయిల్ని ఎత్తి చూపుతూ దండోరా వేస్తూ ముందుకు కదిలారు. అధికారుల వినూత్న పోకడకు ఆయా దుకాణాలదారులు బెంబేలెత్తిపోయూరు. ఈ రూపంలోనైనా బకాయి చెల్లిస్తారన్న నమ్మకంతోనే తాము ఈ మార్గాన్ని ఎంచుకున్నామని, ఇచ్చిన గడువులోపు చెల్లించని దుకాణాల్ని జప్తు చేస్తామని ఓ మండలానికి చెందిన కార్పొరేషన్ అధికారి జగన్నాథన్ పేర్కొన్నారు. నగరం నడి బొడ్డున అన్నా సాలైలోని స్పెన్సర్ ప్లాజాలో ఏకంగా 626 దుకాణాలు ఆస్తి పన్ను బకాయి పడటం బట్టి చూస్తే, ఇక ఇతర మాల్స్‌లో ఏ మేరకు దుకాణాలు బకాయి పడి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.