
‘నువ్వు వెళ్లు.. నేనున్నాగా
న్యూఢిల్లీ: ఇప్పుడు పిల్లల పెంపకంలో తండ్రులూ బాధ్యత తీసుకుంటున్నారని..ఇది శుభ పరిణామమని బాలీవుడ్ నటి సోనాలి బింద్రే వ్యాఖ్యానించింది. ఇటీవల ఆమె తన కుమారుడి బాధ్యతల వల్ల ఫిక్షన్ టీవీ షోను చేయడానికి మొదట వెనుకడుగు వేసింది. అయితే తన భర్త సహకారంతో షోను పూర్తిచేయగలిగానని చెప్పింది. ఈమె భర్త అయిన గోల్డీ బెల్ నిర్మాత కూడా. అలాగే కొడుకు రణవీర్‌కు తొమ్మిదేళ్లు. పిల్లల పెంపకంలో తల్లితో సమానంగా తండ్రి బాధ్యత తీసుకుంటే వారికి మంచి భవిష్యత్తు నిచ్చినట్లవుతుందని ఆమె అభిప్రాయపడింది. ‘ఇంతకుముందు పిల్లలు పుట్టినప్పటినుంచి వారి పెంపకం, ఇతర బాధ్యతలు ప్రధానంగా తల్లిపైనే పడేవి. తండ్రి ఎక్కువ బాధ్యత తీసుకునేవాడు కాదు. కాని నేడు పరిస్థితుల కనుగుణంగా తండ్రులు కూడా పిల్లల బాధ్యతలను తీసుకుంటున్నారు.
ఇది ఆహ్వానించదగ్గ విషయం..’అని అంది. త్వరలో ప్రసారం కానున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’కోసం కనీసం ఆరు నెలల పాటు ఆమె సమయం కేటాయించాల్సి వచ్చింది. దీంతో ఈ సమయంలో కుమారుడి ఆలనా పాలనా చూసుకోవడం కష్టమవుతుందని భావించిన ఆమె మొదట ఈ షోను చేయడానికి వెనుకడుగు వేసింది. అయితే ఆమె భర్త ఇచ్చిన ప్రోత్సాహం, భరోసాతో తను ఈ ప్రాజెక్టుకు అంగీకరించానని ఆమె తెలిపింది. ‘నువ్వు వెళ్లు.. నేనున్నాగా.. రణవీర్ గురించి నా మీటింగ్‌లు, ఇతర పనులు సర్దుబాటు చేసుకుంటా..అని నా భర్త హామీ ఇచ్చాడు. అతడు చెప్పినట్లుగానే రణవీర్ స్కూల్‌కు వెళ్లి తీసుకు వస్తున్నాడు.. అలాగే టెన్నిస్ క్లాస్‌లకు వెళ్లి పికప్ చేసుకుంటున్నాడు..’ అని ఆమె వివరించింది.
‘చిన్నప్పటినుంచి నాకు జంక్‌ఫుడ్‌లు, బయట చేసే తినుబండారాలు తినడం అలవాటు లేదు. వారానికి మూడు రోజులు జిమ్‌కువెళుతుంటా. ప్రతి రెండు గంటలకొకసారి ఆకలయ్యేది. ఏమైనా ఉంటే పెట్టమని మా అమ్మని సతాయించేదాన్ని. దాంతో ఆమె నాపై అప్పుడప్పుడూ కోప్పడేది కూడా.. అయితే ఇప్పుడు ఆరోగ్యం కోసం రూ.లక్షలు ఖర్చుపెట్టి ఏ డైటీషియన్ దగ్గరికెళ్లినా రెండు గంటలకొకసారి తింటే తినమని చెబుతున్నారు..’అని ఆమె నవ్వుతూ చెప్పింది.