సంకటంలో ఓపీఎస్
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో ఎన్నికల కసరత్తుల కన్నా, ఫిర్యాదులు, ఆరోపణాస్త్రాల మీదే టాపిక్ హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఫిర్యాదులు, ఆరోపణలు పెరుగుతున్నా, ఖండించే వాళ్లు లేని దృష్ట్యా, రోజుకో సమాచారాల గుట్టు బయట పడుతున్నాయి. ఇవన్నీ అమ్మ నమ్మిన బంటు ఓ పన్నీరు సెల్వం(ఓపీఎస్)కు సంకటం సృష్టించే రీతిలో ఉండడం గమనార్హం.
ఐదేళ్ల అన్నాడీఎంకే పాలనలో గుట్టుగా సాగిన వ్యవహారాలు ఒక్కొక్కటి బట్ట బయలు అవుతున్నాయి. మంత్రుల అవినీతి బండారాలు ప్రతి పక్షాలకు ప్రచార అస్త్రాలుగా మారాయి. ఇక, పార్టీలో, ప్రభుత్వంలో అధినేత్రి జయలలిత తదుపరి స్థానంలో ఉన్న పన్నీరు సెల్వం మీద కొద్ది రోజులుగా బయలు దేరిన ప్రచారాలను ఖండించే వాళ్లు అన్నాడీఎంకేలో కరువయ్యారని చెప్పవచ్చు. సీట్ల పేరిట కోట్లు దండుకున్నారంటూ ఆయన మీద వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణల్ని అమ్మ తీవ్రంగానే పరిగణించినట్టు సంకేతాలు ఉన్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా పన్నీరు మద్దతు దారులకు అక్కడక్కడ చెక్ పెట్టే ఉద్వాసన పర్వం సాగుతూ రావడమే.
ఇక, మరో మంత్రి నత్తం విశ్వనాథన్ మద్దతు దారుల పరిస్థితి కూడా అంతే. తాజాగా పర్యాటక మంత్రి షణ్ముగనాథన్ పీఏ ఎం కృష్ణమూర్తి తూత్తుకుడిలో బుధవారం అరెస్టు కావడం అన్నాడీఎంకేలో చర్చ బయలు దేరింది. మంత్రుల ప్రమేయాలతో సాగిన వ్యవహారాల గట్టును తేల్చే దిశగా అరెస్టుల పర్వం, ఉద్వాసనల పర్వం సాగుతున్న నేపథ్యంలో గురువారం పన్నీరు మద్దతు సన్నిహితుడు, కాంట్రాక్టర్ ఏఎస్ మురుగానందంపై తిరునల్వేలిలో కేసు నమోదు కావడం గమనించాల్సిన విషయం. పన్నీరుకు బినామీగా కూడా మురుగానందం పేరు విన్పించేది.
ఇప్పుడు ఆయన మీద కేసు నమోదు కావడం, వారం రోజుల క్రితం పన్నీరు సన్నిహితుడు ఒకరు అరెస్టు కావడం బట్టి చూస్తే, తీవ్ర సంకట పరిస్థితుల్ని అమ్మ నమ్మిన బంటు ఎదుర్కొంటుండడం స్పష్టం కాక తప్పదు. చిన్నపాటి వ్యవహారంలో తన మీద కేసు నమోదు తరువాయి, మురుగానందం అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం. ఓపీఎస్ మద్దతు దారులకు, మరో మంత్రి నత్తం మద్దతు దారులు సీట్లకు కోట్లు దండుకున్నారంటూ ఫిర్యాదులు పోయెస్ గార్డెన్‌కు వచ్చి చేరుతున్న సమయంలో మరో మంత్రి సెల్వూరు రాజుతో పాటుగా పలువురు ముఖ్య నాయకులకు సీట్లు ఇవ్వొద్దంటే ఇవ్వొద్దంటూ పోయెస్ గార్డెన్‌కు, అన్నాడీఎంకే కార్యాలయానికి ఫిర్యాదులు వస్తుండడం గమనార్హం.
ఇక, ఏకంగా అన్నాడీఎంకేకు చెందిన మరో మహి ళా ఎంపీ ఫోన్ సంభాషణల గుట్టు రట్టు కావడంతో పార్టీలో తీవ్ర గందరగోళం బయలు దేరి ఉన్నది. ఇప్పటికే ఓ మహి ళా ఎంపి బెదిరింపు ధోరణులు వాట్సాప్, సోషల్ మీడియా ల్లో హల్ చల్ సృష్టించగా, తాజాగా మరో మహిళా ఎంపి తన సన్నిహితుడితో మత్తులతో సాగించిన సంభాషణలు హల్ చల్ సృష్టిస్తుండడం గమనార్హం. అయితే, వీటిని ఖం డించే వాళ్లు అన్నాడీఎంకేలో కరువు కావడం ఆలోచించదగ్గ విషయమే.