దీపా అడుగు
పన్నీరు పిలుపునకు స్పందించేనా?
మద్దతుదారులతో సమాలోచన
నిశితంగా పరిశీలన
సాక్షి, చెన్నై: మేనత్త జయలలితకు తానే వారసురాలి నంటూ రాజకీయల్లో రాణించేందుకు తీవ్రంగా కసరత్తుల్లో ఉన్న దీపా అడుగులు ఇక, ఎలా ఉండనున్నాయో అన్న చర్చ బయలు దేరింది. ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం పిలుపురనకు ఆమె స్పందించేనా అన్న ఎదురు చూపులు బయలు దేరాయి.అమ్మ జయలలిత మరణం తదుపరి నెలకొన్న పరిణామాలతో అన్నాడీఎంకేలోని ద్వితీయ, తృతియ శ్రేణి కేడర్ చూపు దీపా మీద మరలిన విషయం తెలిసిందే. జయలలితమేన కోడలు దీపా నాయకత్వంలో పనిచేసే దిశగా ఆ కేడర్ అడుగులు సాగుతున్నాయి. దీపా పేరవై గొడుగు నీడన బలోపేతం లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. అచ్చం అమ్మ జయలలితను గుర్తుకు తెచ్చే రీతిలో దీపా అడుగులు ముందుకు సాగుతున్నాయి. దీపా పార్టీ పెట్టేనా అన్నంతగా ఇన్నాళ్లు చర్చ సాగుతున్న సమయంలో తాజాగా, అన్నాడిఎంకేలో నెలకొన్న పరిస్థితులు దీపా అడుగులు ఎలా ఉంటుందోనన్న చర్చ బయలు దేరింది.
అమ్మ ఆశయ సాధన లక్ష్యంగా కలిసి పనిచేద్దామంటూ దీపాకు అపధర్మ సీఎం పన్నీరు సెల్వం ఆహ్వానం పలకడంతో ఇక, ఆమె అడుగులు ఎటో అన్న ప్రశ్న బయలు దేరింది. పన్నీరు పిలుపుకు స్పందించేనా లేదా, తన దైన శైలిలోనే ముందుకు సాగేనా అన్న ఎదురు చూపులు బయలు దేరాయి. పన్నీరు ఆహ్వానం, అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలను దీపాతో పాటుగా ఆ పేరవై వర్గాలు నిశితంగా పరిశీంచే పనిలో పడ్డాయి. పేరవై వర్గాలతో దీపా సమాలోచన సైతం సాగిస్తున్నట్టు సమాచారం. పన్నీరు సెల్వం వేయబోయే తదుపరి అడుగుల మేరకు స్పందించాలన్నట్టుగా దీపా నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈవిషయగా పేరవై వర్గాలను కదిలించగా, పన్నీరు ఆహ్వానం మేరకు ఇప్పట్లో స్పందించే అవకాశాలు ఉండబోదని సమాధానం ఇస్తున్నారు. ఇక, ఏకంగా దీపాను కదిలించగా, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, వేచి చూద్దం అని మీడియా ప్రశ్నలకు దాట వేత ధోరణి ప్రదర్శించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే మలర్వన్ మరో అడుగు ముందుకు వేసి దీపా నాయకత్వంలో అన్నాడీఎంకే వర్గాలకు మంచి రోజులు రాబోతున్నాయని స్పందించడం విశేషం. అలాగే, అన్నాడిఎంకే రెండాకుల చిహ్నం దీపా చేతికి రావడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు.