ఓపీఎస్ శిబిరానికి దీప ఎందుకొచ్చింది?
టీనగర్: జయలలిత మేనకోడలు దీప మంగళవారం హఠాత్తుగా ఓ. పన్నీర్ సెల్వం వర్గం లో చేరడం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర సంచలనం కలిగించింది. దీనికి గల కారణాలు ఆసక్తికరంగా నిలిచాయి. దీప గత రెండు నెలలుగా అన్నాడీఎంకేలో కొత్త గుర్తింపు పొందారు. జయలలిత పుట్టిన రోజైన ఫిబ్రవరి 24వ తేదీన తన తదుపరి చర్యల గురించి ప్రకటించనున్నట్లు తెలిపారు. దీప కొత్త పార్టీ ప్రారంభించాలని, తమను నడిపించాలంటూ ఆమె మద్దతుదారులు ప్రకటించారు. అయితే ఆమె తగిన నిర్ణయాన్ని తీసుకొనడంలో కాలయాపన చేశారు. ఇలావుండగా ఆమె పర్యటనకు పోలీసులు అనుమతి నివ్వకపోవడంతో ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఇటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేశారు. పన్నీర్ సెల్వం నిర్ణయాన్ని అన్నాడీఎంకే వర్గాలు స్వాగతించాయి. ఈ క్రమంలో పన్నీర్ సెల్వంతో కలిసి పనిచేయాలని కొందరు దీప మద్దతుదారులు ఆమెకు సూచించారు. అదే సమయంలో పన్నీర్ సెల్వం కూడా దీపకు ఆహ్వానం పలికారు. అయితే ఆయన ఆహ్వానాన్ని అంగీకరించేందుకు దీప సంశయించారు. పన్నీర్‌తో వెళితే తమకు మర్యాద అంతగా ఉండదని మద్దతుదారులు నిరాదరణకు గురవుతారని ఆమె భావించారు. అందువల్ల అనుకున్న ప్రకారం ఈనెల 24వ తేదీన కొత్త పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
ఈరోడ్‌లో భారీ స్థాయిలో మహానాడు జరిపి అందులో కొత్త పార్టీని ప్రకటించాలనుకున్నారు. మహానాడు ఏర్పాట్లు కూడా జరుగుతూ వచ్చాయి. దీంతో ఆమె మద్దతుదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలావుండగా ఎవరూ ఊహించని విధంగా మంగళవారం రాత్రి మెరీనా తీరంలో జయలలిత సమాధి వద్ద ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను దీప కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ అన్నాడీఎంకే ఇరు హస్తాలుగా తాను, పన్నీర్ సెల్వం పనిచేస్తామని, ఇది తన రాజకీయ ఆరంగేట్రమని ప్రకటించారు. అంతకు మునుపు వరకు ప్రత్యేక పార్టీ ప్రారంభించనున్నట్లు చెబుతూ వచ్చిన దీప హఠాత్తుగా ఈ నిర్ణయానికి రావడం ఆమె మద్దతుదారులకు మింగుడుపడలేదు.
దీనిగురించి దీప పేరవై నిర్వాహకుడు ఒకరు మాట్లాడుతూ పన్నీర్ సెల్వం ఆహ్వానం గురించి దీప తన అభిప్రాయాన్ని కోరారని, 70 శాతం మంది పన్నీర్ సెల్వంతో కలిసి పనిచేయాలన్న అభీష్టాన్ని వ్యక్తం చేశారని, దీంతో పన్నీర్ సెల్వం వర్గంతో దీప చర్చలు జరిపారని, అయితే ఆరంభంలో దీప నిబంధనలు అంగీకరించేందుకు వారు సంశయించినట్లు తెలిపారు. దీంతో అనుకున్న ప్రకారం కొత్త పార్టీ ఏర్పాటుకు దీప నిర్ణయించారని, ఇలావుండగా సోమవారం రాత్రి పన్నీర్ సెల్వం స్వయంగా ఫోన్‌లో దీపతో మాట్లాడారని అందులో ఆయన దీపను తమ వైపునకు రావాలని కోరారు, కారణమేమంటే, బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలందరూ తమ వైపునకు వచ్చినట్లయితే తగిన బలాన్ని నిరూపించుకుని ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చని చెప్పడంతో దీప ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.