అచ్చం అమ్మలానే! | Sasikala doles out party posts to keep senior leaders in fold | Sakshi
Sakshi News home page

అచ్చం అమ్మలానే!

Published Sun, Feb 5 2017 1:51 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

Sasikala doles out party posts to keep senior leaders in fold

► ఆర్కేనగర్‌ నుంచి దీప రాష్ట్ర పర్యటన
►  జయ బాణీలో ప్రచారం
► నేడు కన్వీనర్లతో సమావేశం
► జయ మృతిపై ప్రధానికి గౌతమి లేఖ


సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లో కాలుమోపిన జయలలిత మేనకోడలు దీప అత్త బాణీలోనే సాగుతున్నారు. ఎమ్మెల్యేగా అత్త ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్‌ నుంచి తన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. వేష భాషలు, ఆప్యాయంగా మాటతీరు అమ్మను తలపిస్తోందంటూ ఆర్కేనగర్‌ ప్రజలు దీపను అక్కున చేర్చుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన రాజకీయ పయనం ఆగదని ఈ సందర్భంగా దీప స్పష్టం చేశారు. రాష్ట్రపర్యటన ఏర్పాట్ల దీప పేరవై కో ఆర్డినేటర్లతో ఆదివారం దీప సమావేశం అవుతున్నారు.

జయలలిత స్థానంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను జీర్ణించుకోలేని పార్టీ శ్రేణులు దీప వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. గత నెల 17వ తేదీన ఎంజీ రామచంద్రన్  జయంతి రోజున రాజకీయాల్లో అడుగుపెట్టినట్లు దీప ప్రకటించారు. ఆరంభంలో పార్టీలోని కార్యకర్తలు మాత్రమే దీపవైపు మొగ్గుచూపగా కాలక్రమేణా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో మద్దతు పలకడం ప్రారంభించారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో దీప పేరవైని స్థాపించి సభ్యులను చేర్పిస్తున్నారు. ఈనెల 24వ తేదీన జయలలిత జయంతి సందర్భాన రాజకీయంగా ఒక కీలకమైన ప్రకటన చేయనున్నట్లు రాజకీయ అరంగేట్రం రోజునే దీప ప్రకటించారు.

అత్త జయలలితను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఆర్కేనగర్‌ నుంచే తన పర్యటనను ప్రారంభించారు. అన్నాదురై జయంతి సందర్భంగా శుక్రవారం మెరీనాబీచ్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించి ఆర్కేనగర్‌కు చేరుకోవాలని ఆమె తలంచారు. దీప రాక సందర్భంగా ఆమె అభిమానులు ఆర్కేనగర్‌లో ఏర్పాటు చేసిన వేదికను తొలగించాలని పోలీసులు అభ్యంతరం చెప్పగా అన్నాడీఎంకే కార్యకర్తలు, దీప అభిమానులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆర్కేనగర్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో దీప తన పర్యటనను కొద్దిసేపు వాయిదా వేసుకుని ఆ తరువాత వచ్చారు. జయలలిత వలే నిండుగా కప్పుకుని ఆర్కేనగర్‌లో పర్యటించారు. స్థానికంగా ఉన్న తన అభిమానులను, వృద్ధులను, చిన్నారులను కలుసుకున్నారు. వృద్ధ మహిళల కాళ్లకు దీప నమస్కరించారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీచేయాల్సిందిగా దీపను కోరగా, త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని బదులిచ్చారు. జయలలిత వదిలి వెళ్లిన ఆశయాలను తాను నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఆర్కేనగర్‌లోని మూడు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయకాలను పంచిపెట్టారు. ఆర్కేనగర్‌ ప్రజలు అమ్మ మరణం అనుమానాస్పదమని భావిస్తున్నారు. అంతేగాక జయలలిత అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోవడానికి శశికళే కారణమని దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రధాన కార్యదర్శిగా అమ్మ పదవిలో కూర్చునట్లే ఆర్కేనగర్‌ నుంచి పోటీకి దిగితే సహించబోమని, ఎన్నికల పర్యటనకు వస్తే తరిమికొడతామని హెచ్చరిస్తున్నారు. అర్కేనగర్‌ ప్రజల హృదయాల్లో అమ్మ ఆ స్థాయిలో గూడుకట్టుకుని ఉండగా దీప పర్యటన వారిలో సంతోషాన్ని కలిగించింది. నిన్ను చూస్తుంటే అమ్మను చూసినట్లే ఉందని ఆనందపడిపోతూ దీపకు అఖండస్వాగతం పలికారు.

జయ మరణ మిస్టరీపై పోరాటం తప్పదా: ప్రధానికి నటి గౌతమి లేఖ
జయలలిత మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీని బద్దలు కొట్టేందుకు న్యాయవిచారణ జరపాలన్న తన డిమాండ్‌పై కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తూ నటి గౌతమి ప్రధాని మోదీకి శనివారం లేఖ రాసారు. జల్లికట్టు పోరాటంలా ప్రజలు ఉద్యమించక తప్పదాని నిలదీశారు. జయలలిత మరణం పట్ల తమిళనాడు ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేలా విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ గత ఏడాది డిసెంబరు 8వ తేదీన గౌతమి ప్రధానికి లేఖ రాశారు. అయితే ఇంత వరకు కేంద్రం నోరుమెదపక పోవడంతో శనివారం మరోసారి ఉత్తరం రాశారు. జయలలిత మరణం విచారణకు ఆమోదించాలంటే తాము ఇంకా ఏమి చేయాల్లో చెప్పాల్సిందిగా ఆమె కోరారు. కేంద్రం దృష్టిని ఆకర్షించేలా జల్లికట్టును పోలిన ఉద్యమాన్ని లేవనెత్తాలా అని వ్యాఖ్యానించారు.              

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement