మద్దతు
జయ మేనకోడలు దీప రాజకీయ అరంగేట్రం జరిగిపోగా ఆమెకు బాసటగా నిలిచేవారి సంఖ్య పెరుగుతోంది. అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే మలరవన్ దీపకు మద్దతుగా పార్టీ నుంచి వైదొలిగారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలను శశికళ చేపట్టినా పార్టీలో ప్రశాంత వాతావరణం నెలకొనలేదు. శశికళ నాయకత్వాన్ని సహించలేని వారంతా దీప వైపు చూస్తున్నారు. వారిలో కొందరు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు. తాజాగా కోయంబత్తూరు మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే మలరవన్ బుధవారం మీడియా సమావేశం పెట్టి మరీ శశికళపై విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకేను ఎంజీఆర్ స్థాపించిన నాటి నుంచి పార్టీలో కొనసాగుతున్నానని, ఆయన మరణం తరువాత జయలలిత నాయకత్వంలో కొనసాగానని చెప్పారు. అన్నాడీఎంకేలో పార్టీపరంగా, ప్రజాప్రతినిధిగా అనేక పదవుల్లో ఉంటూ ప్రజాసేవ చేశానని తెలిపారు. అయితే జయలలిత మరణం తరువాత పార్టీ పరిస్థితులు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శశికళ భర్త నటరాజన్ తాను, తన కుటుంబ సభ్యులు పార్టీ ప్రగతికి పాటుపడ్డానని చెప్పుకోవడం బాధాకరమని అన్నారు. అన్నాడీఎంకే అంటే ప్రాణంఇచ్చే ఎవ్వరూ ఆయన మాటలను సహించలేరని తెలిపారు. జయలలిత తన స్వయంకృషితో పార్టీని అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. ఇలాంటి అనేక కారణాలతో అన్నాడీఎంకే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకేకు సరైన నాయకురాలు దీప మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. దీప మాత్రమే జయలలితకు నిజమైన రాజకీయ వారసురాలని ఆయన అన్నారు. దీప పేరవైలో తాను చేరుతున్నానని, మరింత మందిని చేరుస్తానని తెలిపారు.
రూట్‌మ్యాప్ రూపకల్పన:రాజకీయనేతగా తనను తాను ప్రకటించుకున్న దీప రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధం అవుతున్నారు. జయలలిత జయంతి ఫిబ్రవరి 24వ తేదీన రాజకీయంగా ఒక కీలకమైన ప్రకటన చేయబోతుండగా, అప్పటి వరకు రాష్ట్రమంతా పర్యటిస్తానని ఈనెల 17వ తేదీన మీడియా సమావేశంలో తెలిపారు. రాష్ట్రం నలుమూల నుంచి తనకు మద్దతు పెరుగుతుండడంతో పర్యటనకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి బుధవారం ఉదయం 8 గంటల నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. వారందరి అభిప్రాయాలతో కూడిన ఉత్తరాలను స్వీకరించేందుకు మూడు పెద్దసైజు పెట్టెలను అక్కడ ఏర్పాటు చేశారు. వచ్చేనెల 23వ తేదీలోగా పర్యటన ముగించుకోవాలని నిర్ణయించుకున్న దీప త్వరలో తన రూట్‌మ్యాప్‌ను ప్రకటిస్తానని బుధవారం తెలిపారు.
దీప అభిమానులపై దాడి:
ఇదిలా ఉండగా, దీప అభిమానులపై బుధవారం అన్నాడీఎంకే కార్యకర్తలు దాడిచేశారు. తాంబరం ముడిచ్చూరు రోడ్డులోని ఒక కల్యాణమండపంలో దీప అభిమానులు ఎంజీఆర్ శతజయంతి సభను నిర్వహిస్తుండగా దాడులు జరిపి సమావేశాన్ని నిలిపివేశారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను పంపివేశారు.