మరోసారి తెరపైకి సిల్క్‌స్మిత జీవితం
తమిళసినిమా: దివంగత శృంగార తార సిల్క్‌స్మిత జీవిత కథ ఎవర్‌గ్రీన్‌గా మారింది. ఆ నటి బతికున్నప్పడు ప్రేక్షకులను అలరించారు. అర్ధాంతరంగా జీవితాన్ని చాలించి చిత్ర పరిశ్రమకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే సిల్క్‌స్మిత జీవిత ఇతివృత్తంతో తమిళం, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. హిందీలో రూపొందిన దర్టీ పిక్చర్స్ చిత్రంలో స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్ జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు.
అలాగే మలయాళంలో నటి సానాఖాన్ తమిళంలో సోనియా అగర్వాల్ నటించి ప్రాచుర్యం పొందారు. కాగా తాజాగా మరో చిత్రం సిల్క్ కథతో తెరకెక్కనున్నట్టు తాజా సమాచారం. దీన్ని ఆమె రహస్య ప్రేమికుడు తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్మిత రహస్య ప్రేమికుడా? ఆయనెవరు? అంటారా? సీనియర్ దర్శకుడు వేలు ప్రభాకరన్‌కు సిల్క్‌స్మితతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఇంతకు ముందు కొన్ని వివాదస్పద కథా చిత్రాలను తెరకెక్కించి సంచలనాలకు కారణం అయిన వేలు ప్రభాకరన్ స్మితతో తన ప్రేమానుభవాలను చిత్రంగా రూపొందించడానికి సిద్ధం అయ్యారన్నది కోడంబాక్కం వర్గాల సమాచారం. ఇందులో సిల్క్‌స్మితతో ప్రేమానుభావాలతో పాటు తనకు నచ్చిన కొందరు హీరోయిన్లకు సంబంధించిన అంశాలను ఈ చిత్రంలో పొందుపరచనున్నారట. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించే విషయమై వేలుప్రభాకరన్ ఇటీవల సంగీత దర్శకుడు ఇళయరాజాను కలిసినట్టు సమాచారం.