స్టార్స్‌గా ఎదిగారు.. చిన్న వయసులోనే కెరీర్‌ను ముగించారు! | Tollywood Actresses Who Died In Early Age Of With Unexpected Reasons | Sakshi
Sakshi News home page

సౌందర్య టూ పూనమ్‌ పాండే... చిన్న వయసులో తనువు చాలించిన తారలు వీళ్లే!

Published Fri, Feb 2 2024 4:32 PM | Last Updated on Fri, Feb 2 2024 5:54 PM

Tollywood Actresses Who Died In Early Age Of With Unexpected Reasons - Sakshi

సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇకపోతే సినిమాల్లో హీరోయిన్ల పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలా చిన్న వయసులోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన తారలు చాలామందే ఉన్నారు. కానీ కాల కలిసిరాక కొందరు కాలగర్భంలో కలిసిపోయారు. తాజాగా ఇవాళ చిన్న వయసులోనే నటి, మోడల్ పూనమ్‌ పాండే క్యాన్సర్‌తో కన్నుమూసింది. 32 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాదంతో బాలీవుడ్‌, సినీ ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొద్ది రోజుల్లోనే స్టార్స్‌గా ఎదిగిన తారలు చాలామందే ఉన్నారు. కానీ కొందరు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరేమో వ్యక్తిగత జీవితంలో కారణాలతో చిన్న వయసులోనే తనువు చాలించి వెండితెరకు దూరమయ్యారు. అలా చిన్న వయసులో కన్నుమూసిన నటీమణుల్లో తెలుగు హీరోయిన్స్ కూడా ఉ‍న్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. 

టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్..

టాలీవుడ్‌ అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న హీరోయిన్ ఆర్తి అగర్వాల్. అమెరికాలో జన్మించిన బ్యూటీ 31 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో పరిచయమైన ఆర్తి జూన్‌ 6, 2015లో కన్నుమూసింది. బరువు తగ్గడం కోసం ఆపరేషన్‌ చేయించుకోగా.. అది వికటించడంతో తుదిశ్వాస విడిచింది. 

యువనటి భార్గవి కన్నుమూత.. 

అనుమానాస్పద రీతిలో కన్నుమూసిన మరో నటి 'భార్గవి'. అష్టాచెమ్మా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఊహించని విధంగా హత్యకు గురైంది. డిసెంబర్‌ 16న, 2008లో  23 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. గుంటూరు జిల్లా గోరంట్లలో జన్మించిన భార్గవి వైవీఎస్ చౌదరి చిత్రం దేవదాసుతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతకుముందు టీవీ సీరియల్స్‌లో పనిచేసింది

ప్రత్యూష మృతి..

తెలుగులో రాయుడు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటి ప్రత్యూష. భువనగిరికి చెందిన ప్రత్యూష తెలుగుతో పాటు తమిళంలోనూ నటించింది. చిన్న వయసులోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకొచ్చిన ప్రత్యూష చిన్న వయసులోనే 23 ఫిబ్రవరి 2002న 20 ఏళ్ల వయసులోనే  కన్నుమూసింది. 
 
స్టార్‌ హీరోయిన్ సౌందర్య

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ సౌందర్య. కన్నడకు చెందిన ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే 2004 ఎన్నికల్లో భాజపా తరఫున ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. ఆమె మృతితో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. 

సిల్క్ స్మిత సూసైడ్

అప్పట్లోనే వెండితెరను ఓ ఊపు ఊపేసిన నటి సిల్క్ స్మిత. ప్రత్యేక గీతాలతో తెలుగు సినిమాల్లో మెప్పించింది. అయితే వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యలతో చిన్న వయసులోనే సూసైడ్‌కు పాల్పడింది. ఏపీకి చెందిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి 23 సెప్టెంబర్‌ 1996లో 35 ఏళ్లకే కన్నుమూసింది. 

19 ఏళ్లకే దివ్య భారతి 

ముంబైలో జన్మించిన దివ్య భారతి తెలుగు, హిందీ చిత్రాల్లో మెరిసింది. బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత అత్యధిక పారితోషికం పొందిన హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. తన కెరీర్‌లో ఫిల్మ్ ఫేర్‌తో పాటు నంది అవార్డులను గెలుచుకుంది. కానీ ఊహించని విధంగా 19 ఏళ్ల వయసులోనే 5 ఏప్రిల్ 1993 కన్నుమూసింది. ఆమె మృతితో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. 

ఫటాఫట్ జయలక్ష్మి..

ఏపీకి చెందిన జయలక్ష్మి తెలుగు, తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో ఆమెకు ముద్దుగా ఫటాఫట్ జయలక్ష్మిగా అభిమానులు పిలిచేవారు. మలయాళ సినిమాల్లో ఆమెను సుప్రియ అని పిలిచేవారు. ఆమె తన కెరీర్‌ సాగిన పదేళ్లలోనే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 66 సినిమాల్లో నటించింది. అంతులేని కథ సినిమాలో ఫటాఫట్ అంటూ సంచలనం సృష్టించింది. కానీ అప్పట్లో ఓ బడా హీరో కుమారుడితో వివాదం కారణంగా కేవలం 22 ఏళ్లకే ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించింది.

బాలీవుడ్ నటి జియా ఖాన్.. 

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నిశ్శబ్ద్ సినిమాతో బాలీవుడ్‌లో పాపులర్ అయిన హీరోయిన్ జియా ఖాన్. ఆ తర్వాత డిప్రెషన్ కారణంగా తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 1988లో అమెరికాలో జన్మించిన బ్యూటీ 25 ఏళ్ల వయసులోనే జూన్‌ 3,2013లో కన్నుమూసింది.   

తమ టాలెంట్‌లో కలల ప్రపంచంలోకి అడుగుపెట్టిన సినీ తారలు అర్ధాంతరంగా కెరీర్‌ను ముగించారు. అలా ఇచ్చి.. ఇలా వెళ్లిపోయి అభిమానులకు షాకిచ్చారు. ఎంతో టాలెంట్‌ ఉన్నప్పటికీ కాలం కలిసిరాకపోవడంతో వెండితెరతో పాటు ఏకంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చిన్న వయసులోనే స్టార్స్‌గా ఎదిగినా.. చివరికీ విషాదంతో తమ జీవితాలను ముగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement