సోషల్ మీడియాలో డెయిరీ వివాదం
Published Thu, Sep 8 2016 3:56 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
రచ్చకెక్కిన ఒంగోలు పాల డెయిరీ అవినీతి
చైర్మన్‌ను ‘పాలమాల్యా’గా అభివర్ణించిన టీడీపీ కార్యకర్తలు
ఆ పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య మాటల యుద్ధం
పతాకస్థాయికి చేరిన చైర్మన్‌పై ఆరోపణలు
డెయిరీ చైర్మన్‌పై దుమ్మెత్తిపోస్తున్న స్వపక్షం
డెయిరీని కాపాడుకుందామంటూ ఉద్యమం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు డెయిరీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయా.. నిబంధనలకు విరుద్ధంగా డెయిరీని కంపెనీ యాక్టులోకి మార్చడమే కాకుండా కోట్లాది రూపాయల నిధులు మింగేశారా.. ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వకుండా సొమ్ము స్వాహా చేశారా.. ఇవి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెలువడుతున్న ఆరోపణలు. ఒంగోలు డెయిరీపై పతాకస్థాయికి చేరిన ఆరోపణలు చూస్తే ఎవరికైనా నిజమేనని అనిపించక మానదు. విశేషమేమిటంటే ఆరోపణలు చేస్తోంది సాక్షాత్తు అధికార పార్టీ కార్యకర్తలే. నేతల అక్రమాలకు అడ్డుకట్ట వేసి ఒంగోలు డెయిరీని కాపాడుకుందామంటూ టీడీపీ కార్యకర్తలు ఏకంగా డెయిరీ చైర్మన్‌పైనే పెద్ద ఎత్తున ఆరోపణలకు దిగారు. ఇందుకు సోషల్ మీడియానే వేదిక చేసుకోవడం గమనార్హం. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఆరోపణలు పరిశీలిస్తే..
డెయిరీ చైర్మన్ చల్లాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ ఇలా..
ఆంధ్రా బ్యాంక్ కు నుంచి రూ.10 కోట్ల రుణం తెచ్చి ఆ నిధులను చైర్మన్‌నే స్వాహా చేసినట్లు సోషల్ మీడియాలో పచ్చ పార్టీ కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. మళ్లీ అదనంగా మరో రూ.10 కోట్లు ఇవ్వమని బ్యాంకు అధికారులను చైర్మన్ కోరగా ట్రాక్ రికార్డు సరి లేదంటూ వారు ముఖం చాటేసినట్లు సమాచారం.
ఇండేస్ బ్యాంక్ విశాఖ నుంచి రూ.5 కోట్లు సైతం స్వాహా చేసినట్లు ఆరోపిస్తున్నారు.
రాయలసీమ పాలను పొడిగా మార్చినందుకు వచ్చిన డబ్బులను సైతం స్వాహా చేశారని, డెయిరీలోని సరుకు, గ్రాట్యుటీకి కట్టాల్సిన సొమ్ము సైతం స్వాహా అయినట్లు ఆరోపిస్తున్నారు.
డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావును ‘పాల మాల్యా’ అంటూ పేరు పెట్టి మరీ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
కర్ణాటక ఫెడరేషన్ నుంచి ఒంగోలు డెయిరీకి వచ్చే పాలను పొడిగా మార్చి వారికి వెనక్కి ఇవ్వవలసిన 700 టన్నుల పొడిని సొంతానికి అమ్ముకున్నారని, హేరిటేజ్ పాలను పొడిగా మార్చి దాన్ని సైతం అమ్ముకోగా గొడవ కావడంతో గోప్యంగా డబ్బులు కట్టిన వైనాన్ని సోషల్ మీడియాలో చూపించారు.
423 పాల సొసైటీలుండగా కేవలం 10 సొసైటీల మద్దతుతో డెయిరీని కంపెనీల యాక్టులోకి మార్చిన వైనంపై విమర్శలు గుప్పించారు.
హైకోర్టు ఆస్తుల బదలాయింపుపై స్టే ఇచ్చిన ఆ ఆస్తులను తనఖా పెట్టి లోన్లు తెస్తున్నారని ట్రైపార్టీ అగ్రిమెంటు బ్యాంకుల ద్వారా మీకు రైతులకు ఇప్పించిన బర్రెల లోన్లు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద జమ చేసుకుంటున్న దానిలో కిరికిరి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
పాల లెక్క సొంత జేబుల్లోకి వెళ్తుందని చైర్మన్‌పైనే ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఒంగోలు డెయిరీ ప్రకాశం జిల్లా పాడి రైతుల బకాయిలు చెల్లించని దివాలాకోరు తనానికి దిగజార్చింది మీరేనంటూ చైర్మన్‌పై ధ్వజమెత్తుతున్నారు.
ప్రకాశం జిల్లా పాడి రైతుల ఆత్మాభిమానాన్ని విశాఖ డెయిరీకి తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు.
డెయిరీ ఉద్యోగుల సహకార పరపతి సంఘం లిమిటెడ్ జూలై 1వ తేదీకి జమ చేయాల్సిన రూ.4 లక్షలు నేటి కీ జమ చేయలేదని ఆరోపిస్తున్నారు. పాల డెయిరీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత తమపైన ఉందంటూ అధికార పార్టీకి చెందిన డెయిరీ చైర్మన్‌పై ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలకు దిగడం పెద్ద చర్చకు దారి తీసింది.
Advertisement
Advertisement