ఉల్లి కోయకుండానే నగరవాసులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్కెట్‌లో దీని రేటు వింటేనే కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లోకి వచ్చే సరఫరా తగ్గిపోవడంతో రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.45కు చేరుకుంది. స్థానిక వ్యాపారులు రూ.55 నుంచి 65 మధ్యలో విక్రయిస్తున్నారు.
సాక్షి, ముంబై: ఉల్లి కోయకుండానే నగరవాసులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్కెట్‌లో దీని రేటు వింటేనే కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లోకి వచ్చే సరఫరా తగ్గిపోవడంతో రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.45కు చేరుకుంది. స్థానిక వ్యాపారులు రూ.55 నుంచి 65 మధ్యలో విక్రయిస్తున్నారు. ‘భారీ వర్షాల వల్ల గత రెండు నెలలుగా ఉల్లి కొరత ఉంది. ప్రతిరోజూ సుమారు 100కుపైగా వచ్చే ఉల్లి లారీలు ప్రస్తుతం 60 వరకు మాత్రమే వస్తున్నాయి. దీంతో సరఫరా తగ్గింది. డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఉల్లిగడ్డ ధరలకు రెక్కలొచ్చాయ’ని నవీముంబైలోని ఏపీఏంసీ ఉల్లి టోకు వ్యాపారి మనోహర్ తోత్లానీ సాక్షికి తెలిపారు. శనివారం పరిశీలిస్తే కేవలం 60 లారీలు ఉల్లిని తీసుకుని ఏపీఎంసీ మార్కెట్‌లోకి వచ్చాయి. దీంతో ఈ రోజు ధరలు సాధారణ ఉల్లి రూ. 35 వరకు పలుకగా, నాణ్యమైన ఉల్లి రూ. 45 వరకు పలికిందని ఆయన వివరించారు.
మరింత పైపైకే...
ముంబై, ఠాణే, నవీముంబైలలో నాణ్యమైన ఉల్లిని రూ. 60 నుంచి రూ. 65 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మనోహర్ తోత్లానీ చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, గతంలో ఏర్పడిన కరువు పరిస్థితి కారణంగానే ఉల్లి దిగుబడి తగ్గిందన్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొత్త పంట వచ్చే వరకు కొంత సమయం పట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం నాసిక్ జిల్లాల్లో లాసల్‌గావ్‌తో పాటు ఇతర మార్కెట్‌లలో కూడా నిల్వలు చాలా తగ్గాయని తెలిపారు. మార్కెట్‌లోకి వచ్చే ఉల్లి లారీల సంఖ్య ఎంత తగ్గితే అంత ధరలు పెరిగే అవకాశముందన్నారు. ఇక చిల్లర మార్కెట్‌లో ఉల్లిని డిమాండ్‌ను బట్టి విక్రయిస్తున్నట్టు తెలిసింది. ముంబై, ఠాణే, నవీ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ. 50 నుంచి రూ. 65 వరకు విక్రయిస్తుండడం విశేషం.
నగరవాసుల మండిపాటు
రోజురోజుకు ఉల్లిగడ్డ ధరలు పెరుగుతుండటంపై నగరవాసులు మండిపడుతున్నారు. ప్రతిరోజూ వంటకంలో తప్పక ఉపయోగించాల్సిన ఈ ఉల్లిగడ్డ ధరల రెక్కలకు కళ్లెం వేసేందుకు సర్కార్ త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అక్రమ నిల్వదారులపై కొరడా ఝళిపించాలన్నారు. సామాన్యుడికి తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా స్టాళ్లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెన్నెస్ ఆధ్వర్యంలో ఉల్లి అమ్మకాలు
ముంబై: ఉల్లిగడ్డ ధరలు ఆకాశన్నంటుతుండటంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కార్యకర్తలు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తక్కువ ధరకు విక్రయించారు. తమ వార్డుల్లోని 16,000 కుటుంబాలకు ఉల్లిగడ్డలు అమ్మామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో ఎమ్మెన్నెస్ పక్ష నేత దిలీప్ లాండే తెలిపారు. రైతుల నుంచి రూ.22కు కేజీ ఉల్లిగడ్డను కొనుగోలు చేసి రూ.25లకి అమ్మామని తెలిపారు. హోల్‌సేలర్‌లే ఉల్లిగడ్డలను అక్రమంగా నిల్వచేసి పరోక్షంగా ధరలను పెరిగేలా చేస్తున్నారని విమర్శించారు. గురువారం వరకు రూ.30 నుంచి రూ.32 మధ్యలో ఉన్న ఉల్లి ఆదివారం రూ.60లకు ఎగబాకిందని వివరించారు. పెరిగిన ధరల వల్ల రైతులకు ఏమీ లభం చేకూరడం లేదన్నారు. అక్రమ నిల్వదారులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైతే వాషి వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీ గోడౌన్‌లపై దాడి చేస్తామని ఆయన హెచ్చరించారు.