హైకోర్టు విభజనే ప్రధాన అజెండాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వ్యవహరించాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయత్రం 5 గంటల వరకు ఆయన అధికార నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు.
పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సి వ్యూహాన్ని చర్చించారు. హైకోర్టు విభజనే అజెండాగా ముందుకు సాగాలని, అయితే కేంద్రం స్పందించే తీరును బట్టి ప్రణాళిక ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి, పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి మీడియాకు సమావేశ వివరాలను వెల్లడించారు.
‘రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా హైకోర్టు విభజన కాలేదు.ఇంతకుముందు ఉత్తరాఖండ్, ఛ త్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు 15 రోజుల్లో హైకోర్టులు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ విషయంలో జాప్యం చేస్తూ వస్తున్నారు. అందువల్ల ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విభజన చేయాలన్నది మా డిమాండ్. కేంద్ర ప్రభుత్వానికి అంశాలవారీగా మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..’ అని పేర్కొన్నారు. హైకోర్టు విభజనపై పార్లమెంటులో ఆందోళన ఏవిధంగా ఉండబోతోందన్న ప్రశ్నకు బదులుగా ‘మా నిరసన తెలుపుతాం. ఏవిధంగా ఉండబోతోందన్న దానిపై వ్యూహం ఖరారు చేస్తాం. వారి స్పందనను బట్టి మా వైఖరి ఉంటుంది..’ అని పేర్కొన్నారు.
హైకోర్టు విభజన రాష్ట్ర పరిధిలో ఉందని, కేంద్రం విధి ఏమీ లేదని గతంలో న్యాయమంత్రి చెప్పారని మీడియా ప్రస్తావించగా ‘కేంద్రం గందరగోళంలో ఉంది. న్యాయమంత్రి సబ్ జ్యుడిస్ అని చెబుతారు. మరికొందరు పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ హైకోర్టు విభజన జరగాలి. అందుకు మా ఆందోళన కొనసాగుతుంది..’ అని పేర్కొన్నారు.