బీజేపీ తలుపులు తెరిచే ఉన్నాయి...
♦ తలుపులు తెరిచే ఉన్నాయి...
♦ అమిత్‌షా వ్యాఖ్యలు
♦ రజనీ అభిమానుల్లో ఉత్సాహం
♦ వ్యతిరేకతను అధిగమిస్తామని పోస్టర్లు
♦ ఢిల్లీ పయనానికి కథానాయకుడి కార్యాచరణ
తలైవా రాజకీయ ప్రవేశాన్ని ఆహ్వానించేందుకు కమలం పెద్దలు సిద్ధమయ్యారు. తలుపులు తెరిచే ఉన్నాయంటూ, తమతో చేతులు కలపాలన్న సంకేతాన్నిరజనీకాంత్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇవ్వడం గమనార్హం. ఇక, అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటనకు కథానాయకుడు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.
సాక్షి, చెన్నై: దేవుడు ఆదేశిస్తే...అంటూ కొన్నేళ్ల పాటు తన రాజకీయ ప్రవేశంపై దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ దాటవేత ధోరణి అనుసరించారు. అయితే, ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు అభిమానులతో సూపర్‌స్టార్ సాగించిన భేటీ రాజకీయ చర్చను ఉధృతం చేసింది. దేవుడు ఆదేశించినట్టేనా అన్నట్టుగా రజనీ వ్యాఖ్యలు సాగినా, చివరకు సమయం ఆసన్నమైనప్పుడు యుద్ధానికి సిద్ధం అవుదాం అన్న పిలుపుతో ముగిం చారు. దీంతో రజనీ రాజకీయాల్లోకి వస్తారా? అన్న చర్చ ఊపందుకుంది.
రజనీ స్పందించిన తీరు చర్చకు, వివాదానికి సైతం దారి తీశాయి. వస్తే ఆహ్వానిస్తామని కొందరు, ఏ అర్హత ఉందో అంటూ మరికొందరు...ఇలా ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా అడ్డుకట్ట వ్యవహారాలు బయలు దేరాయి. రైతన్నల కోసం స్పందించావా, ఈలం తమిళుల కోసం గళం విప్పావా అని ఓ వైపు, తమిళ ప్రజల కోసం చేసిందెమిటో..?, తమిళులే రాష్ట్రాన్ని ఏలాలంటూ మరో వైపు ఇలా...ముప్పేటదాడి అన్నట్టుగా రజనీకాంత్‌ను, ఆయన అభిమాన లోకాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే వాళ్లు పెరిగారు.
వీటిని తిప్పి కొట్టే విధంగా రజనీకాంత్ ఎలా స్పందిస్తారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. అలాగే, బీజేపీలో చేరతారా సొంత పార్టీని ప్రకటిస్తారా అన్న చర్చ ఊపందుకుని ఉంది. ఈ పరిస్థితుల్లో తలైవాకు ఆహ్వానం పలికే విధంగా బీజేపీ తలుపులు తెరిచి ఉంచాం..ఉంచుతాం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించడం గమనార్హం.
తలైవాకు ఆహ్వానం: ఢిల్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మీడియా సంధించిన ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ, రజనికీ ఆహ్వానం పలకడం విశేషం. బీజేపీ తలుపులు తెరిచే ఉన్నాయని, ఎప్పుడూ తెరిచే ఉంచుతామని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రవేశంపై దీర్ఘంగా ఆలోచించి ఆయన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆయన సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్న పక్షంలో తదుపరి చర్చిస్తామని అమిత్‌షా స్పందించారు. కమలం నుంచి తమ నాయకుడికి ఆహ్వానం రావడంతో కథానాయకుడి అభిమానుల్లో మరింత జోష్‌ను నింపింది.
రాష్ట్రంలో బయలు దేరిన వ్యతిరేకత, అడ్డంకుల్ని అధిగమించే విధంగా, ప్రజల్ని ఆకర్షించే రీతిలో పోస్టర్ల ఏర్పాటు మీద అభిమానుల దృష్టి కేంద్రీకరించే పనిలో పడ్డారు. యుద్ధానికి తాము సిద్ధమని, తలైవా దీవించూ అంటూ కొన్ని చోట్ల, తలైవాతోనే తమిళనాడు ప్రగతి అన్న నినాదాలతో మరికొన్ని చోట్ల పోస్టర్లు హోరెత్తుతుండడం గమనార్హం. రజనీ రాజకీయ ప్రవేశ ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో సినీ రంగం నుంచి మరో నాయకుడిగా తలైవా అవతరించేనా అన్న చర్చ తెరమీదకు వచ్చింది. ఇక, కమలం పెద్ద ఆహ్వానాన్ని రజనీ నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. అనుమతి తరువాయి ఢిల్లీ వెళ్లడానికి తగ్గ కార్యాచరణతో సూపర్‌స్టార్ ముందుకు సాగుతున్నట్టు తెలిసింది.