ముంబై : నగరంలో 2008 నవంబర్ 26వ తేదీన జరిగిన తీవ్రవాదుల దాడి కేసుకు సంబంధించి భారత్‌లోని సాక్షులను 8 మంది సభ్యులుగల పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ ఈ నెల 24న విచారించనుంది. సాక్ష్యాలను అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి పి.వై.లడేకర్ నమోదు చేయనున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ఘటనలో పట్టుబడిన పాక్ తీవ్రవాది అజ్మల్‌కసబ్ వాంగ్మూలాన్ని నమోదుచేసిన నగర న్యాయమూర్తి, కేసులో ముఖ్య నేరపరిశోధన అధికారి రమేష్ మెహలే, సెక్యూరిటీ దళాల చేతిలో హతులైన 9 మంది పాక్ తీవ్రవాదుల పోస్టుమార్టం నిర్వహించిన ఇద్దరు డాక్టర్లు పాక్ జ్యుడీషియల్ కమిషన్ ముందు సాక్ష్యం చెప్పనున్నారు. కమిషన్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. మొదటిసారి 2012 మార్చిలో కమిషన్ భారత్‌ను సందర్శించింది.
అయితే అప్పుడు సాక్షులను విచారించేందుకు కమిషన్‌కు భారత్ అనుమతి ఇవ్వకపోవడంతో అప్పటి నివేదికను పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు వస్తున్న కమిషన్‌లో నూతన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తోపాటు పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు సంబంధించిన ఇద్దరు అధికారులు ఉన్నారు. కమిషన్ సభ్యులకు వారం పాటు పనిచేసే వీసాను బుధవారం ఇచ్చార ని, వీరు వాఘా సరిహద్దు నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తారని అధికారులు తెలిపారు. ఈ కేసులో భారత్ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నిఖమ్ వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఉజ్వల్ నిఖమ్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఈ కేసుకు సంబంధించిన సాక్షులను విచారించేందుకు భారత్ తిరస్కరించందన్నారు. అయితే ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో భారత్ సాక్షులను విచారించేందుకు పాక్ కమిషన్ సభ్యులు వస్తున్నారని చెప్పారు. ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో ఏడుగురు నిందితులపై విచారణ జరుగుతోంది.
ఇందులో లష్కరే-ఇ-తోయిబా కమాండర్ జాకీర్ రెహ్‌మాన్ లక్వీ కూడా ఉన్న సంగతి విదితమే. ఈ కేసు విచారణ భారత్‌లో విచారణ పూర్తయ్యింది. నిందితుడు అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష విధించి అమలు చేసింది కూడా. అయితే పాక్‌లో మాత్రం కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసును వీలయినంత త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా రెండు దేశాలమధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల నిఖమ్‌తో పాటు భారత్ ప్రతినిధి బృందం పాకిస్థాన్‌ను సందర్శించి అక్కడి అధికారులతో సమీక్షించారు. అప్పటి ఒప్పందం మేరకు పాక్ జ్యుడీషియల్ కమిషన్ సభ్యులకు భారత్ సాక్షులను విచారించేందుకు అంగీకరించారు. కాగా గత పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఉగ్రవాదులు హతమార్చిన క్రమంలో కమిషన్ భారత్ పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటివరకు పాక్ కమిషన్ సభ్యుల పర్యటన వివిధ కారణాల వల్ల మూడుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 24న సభ్యులు భారత్‌ను సందర్శించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది.
24న సాక్షుల విచారణ
Published Sat, Sep 21 2013 2:51 AM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM
Advertisement
Advertisement