పన్నీర్‌ మనిషా.. పక్కనపెట్టు | Palanisamy shock to Contractor Sekhar Reddy | Sakshi
Sakshi News home page

పన్నీర్‌ మనిషా.. పక్కనపెట్టు

Published Tue, Mar 14 2017 2:02 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

Palanisamy shock to Contractor Sekhar Reddy

రాష్ట్ర రాజకీయాలు ఉరుము ఉరిమి మంగళం మీద పడింది అనే సామెతను తలపిస్తున్నాయి. అన్నాడీఎంకేలో ఏర్పడిన చీలికలు, అధికార మార్పిడితో నెలకొన్న పరిస్థితులు ఏ సంబం ధం లేని భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పన్నీర్‌సెల్వం మనిషి అనే కారణంతో కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డికి చెందిన 25 క్వారీలను మూసివేయించడం ద్వారా  భవన నిర్మాణ రంగానికి సీఎం ఎడపాడి పళనిస్వామి షాక్‌ ఇచ్చారు.

సాక్షి ప్రతినిధి, చెన్నైః క్వారీల కాంట్రాక్టర్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై గత ఏడాది ఆదా యపు పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. పెద్దఎత్తున పాత నగదు, బంగారు, కొత్త కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శేఖర్‌రెడ్డితో పాటూ ఆయన వ్యాపార భాగస్వాములను అరెస్ట్‌ చేసి పుళల్‌ జైల్లో పెట్టారు. రాష్ట్రంలో మొత్తం 30 క్వారీలు ఉండగా, వీటిల్లో 25 క్వారీలు శేఖర్‌రెడ్డి ఆధీనంలో ఉన్నాయి. అంటే దాదాపు 90 శాతానికి పైగా ఇసుక లావాదేవీలు శేఖర్‌రెడ్డి కనుసన్నల్లో సాగాల్సిందే.

మళ్లీ తెరపైకి శేఖర్‌రెడ్డి అంశం
తన వ్యాపార భాగస్వామ్యులతో కలిసి పుళల్‌ జైల్లో ఉంటూ అడపాదడపా బెయిల్‌ పిటిషన్‌తో కోర్టుకు హాజరవుతున్నపుడు మినహా శేఖర్‌రెడ్డి పేరు దాదాపు తెరమరుగైంది. జయ మరణంతో అధికార అన్నాడీఎంకే శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలుగాచీలిపోవడం, పన్నీర్‌సెల్వం స్థానంలో ఎడపాడి పళనిస్వామి సీఎం కావడంతో అన్యాపదేశంగా శేఖర్‌రెడ్డి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలోని జయ ప్రభుత్వం మొత్తం 30 క్వారీలకు లైసెన్సు జారీ చేసి ఉండగా వీటిల్లో 25 క్వారీలను శేఖర్‌రెడ్డికి కట్టబెట్టారు. ఒక యూనిట్‌ ఇసుక రూ.800లుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయించిన ధర కంటే అనేక రెట్లు ఎక్కువగా వసూళ్లు సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పొల్లాచ్చీలో ఒక లోడు ఇసుక రూ.18 వేలు కాగా, మదురైలో రూ.13 వేలు, నామక్కల్‌లో రూ.12,500లు, తెన్‌కాశీలో రూ.29 వేలు లెక్కన ఇష్టారాజ్యంగా అమ్మసాగారు. ఇసుక క్వారీలకు సంబంధించి పెద్దఎత్తున సాగుతున్న ఆర్థికలావాదేవీల్లోనే శేఖర్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడినట్లు చెబుతారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి కీలకమైన ఇసుక క్వారీలు శేఖర్‌రెడ్డి చేతిలో ఉన్న సంగతిని ఎడపాడి ప్రభుత్వం ఇటీవల పరిశీలనలోకి తీసుకుంది. సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా, శశికళపై తిరుగుబాటు తదనంతర పరిణామాలతో ఎడపాడి సీఎం అయ్యారు. సీఎంగా ఎడపాడి బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే శేఖర్‌రెడ్డికి స్వాధీనంలోని 25 ఇసుక క్వారీలను మూసివేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని నిర్మాణ రంగానికి మొత్తం 30 క్వారీల నుంచి ఇసుక సరఫరా సాగుతుండగా ప్రస్తుతం ఐదు క్వారీలకే పరిమితమైంది.

కుంటువడిన నిర్మాణ రంగం..
చెన్నై భవన నిర్మాణ రంగ ఇంజినీర్ల సంఘం మేనేజర్‌ వెంకటాచలం సోమవారం మాట్లాడుతూ, గత నెలరోజులుగా రాష్ట్రంలోని తిరుచ్చి, ఆర్కాడు తదితర జిల్లాల్లోని  ఐదు క్వారీల నుంచి అతికష్టం మీద తమకు ఇసుక అందుతోందని తెలిపారు. డిమాండ్‌కు సరఫరాకు మ ధ్య వ్యత్యాసం ఎక్కువ కావడంతో భవన నిర్మాణ రంగం పూర్తిగా కుంటుపడిపోగా కార్మికులకు పనుల్లేక ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూతపడిన 25 క్వారీలను పునరుద్ధరించడం ద్వారా భవన నిర్మాణరంగాన్ని కాపాడాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement