తమిళ సీఎం ఎక్కువ కాలం కొనసాగరు!
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ విధేయుడు, తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన కె.పళనిస్వామి ఎంతో కాలం పదవిలో కొనసాగరని కేంద్ర మంత్రి పోన్ రాధాక్రిష్ణన్ అన్నారు. సొంతింట్లో మన కుర్చీలో కూర్చోవడం.. అద్దె కుర్చీలో కూర్చోవడం రెండు ఒకటి కాదంటూ పళనిస్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే తమిళనాడు కొత్త సీఎం కె.పళనిస్వామి అద్దె కుర్చీ (వేరొకరి స్థానం)లో ఉన్నారని తాను భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
విశ్వాసపరీక్షలో పళనిస్వామి నెగ్గడంపై మంత్రి రాధాక్రిష్ణన్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'అసెంబ్లీలో విశ్వాసపరీక్ష జరిగిన తీరు నిజంగా సిగ్గుచేటు. ప్రతిపక్షాలు లేకుండానే స్పీకర్ ధన్ పాల్ బలపరీక్ష నిర్వహించడం దారుణం. ఈ ఘటనతో రాష్ట్రమంతా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. బలనిరూపణ సమయంలో ప్రతిపక్ష డీఎంకే నేతలపై దాడి విషయంపై ఎంక్వరీ కమిషన్ వేయాలని' ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ ఎంపీ ఎల్.గణేషన్ మాట్లాడుతూ.. పళనిస్వామి అంకెల్లో మాత్రమే మెజార్టీ నిరూపించుకున్నా.. నైతికంగా ఆయన ఓడిపోయారని చెప్పారు. అన్నాడీఎంకే నేతలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి అవకాశం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు.