CM Palanisamy
-
‘సీఎం’ల బినామీ శేఖర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో సాగుతున్న ఇసుక అమ్మకాలు అక్రమాల్లో సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంలకు ఇసుక కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి బినామీ కథనాయకుడని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ ఆరోపించారు. శేఖర్రెడ్డికున్న రాజకీయ అండదండల వల్లనే రూ.33.6 కోట్ల విలువైన కొత్త కరెన్సీ ఆయనకు ఎలా దక్కిందనే విషయం బయటకు రావడం లేదని స్టాలిన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఎస్ఆర్ఎస్ కంపెనీ పేరున రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక క్వారీలు నడిపే కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు గత ఏడాది డిసెంబరు 8వ తేదీన దాడులు నిర్వహించి రూ.170 కోట్ల నగదు, రూ.178 కిలోల బంగారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో రూ.33.6 కోట్ల విలువైన రూ.2000 నోట్ల కొత్త కరెన్సీ ఉండడం కేసు తీవ్రతను పెంచింది. శేఖర్‌రెడ్డి చేతికి ఇంత భారీ మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిందో తమకు తెలియదని సీబీఐకి ఆర్బీఐ సమాధానం చెప్పడం మరింత కలకలం రేపింది. ఈ కేసు విచారణపై స్టాలిన్ స్పందిస్తూ, ఆర్బీఐ అదుపాజ్ఞల్లో పనిచేసే కరెన్సీ ముద్రణాలయాలు, బ్యాంకుల ద్వారా మాత్రమే శేఖర్‌రెడ్డి భారీ మొత్తంలో సొమ్ము ముట్టే అవకాశం ఉంది, అయితే ఆ సొమ్ము ఎలా చేరిందో తమకు తెలియదని ఆర్బీఐ చెప్పడం ఆశ్చర్యమే కాదు తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కరెన్సీ ముద్రణాలయాలు కేంద్రప్రభుత్వం, కర్ణాటక, పశ్చిమబెంగాల్లోని ముద్రణాలయాలు ఆర్బీ ఐ అదుపాజ్ఞల్లో పనిచేస్తాయని ఆయన అన్నారు. రూ. 33.6 కోట్లు ఏ ప్రెస్, బ్యాంకు నుంచి శేఖర్‌రెడ్డికి చేరా యో సీబీఐ కనుగొనలేక పోవడం నమ్మశక్యంగా లేదని అన్నారు. శేఖర్‌రెడ్డి కేసులో ఆధారాలు దొరకలేదు, రాష్ట్రంలో గుట్కా అక్రమ అమ్మకాల విచారణలో ఐటీ అధికారులు అందజేసిన ప్రకటన కనపడటం లేదు, గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటైనర్ ద్వా రా రూ.570 కోట్ల రవాణా అయిన సంగతి ఎన్నికల కమిషన్‌కు,ఆర్బీఐకి తెలియకపోవడం విచిత్రమన్నారు. ఐటీ అధికారుల దాడులన్నీ అంతరంగికం తమిళనాడుకు సంబంధించి ఐటీ అధికారులు జరిపిన దాడులన్నీ అంతరంగికంగా మారడం గమనార్హమని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలోని అక్రమ ఆర్థిక లావాదేవీలన్నీ పథకం ప్రకారం అటకెక్కడంపై ప్రభుత్వం వద్ద సమాధానం లేదని, ఈ పరిస్థితుల్లో సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంల అక్రమార్జనకు శేఖర్‌రెడ్డి బినామీ కథానాయకుడన్న సంగతిని గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఆర్థిక అవకతవకలపై తమ పార్టీ వచ్చేనెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌డే అనుసరిస్తుండగా, తమకు పోటీగా అదే రోజున దేశవ్యాప్తంగా నల్లధన నిర్మూల దినం పాటిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికేనని విమర్శించారు. శేఖర్‌రెడ్డికి రూ.33.6 కోట్లు ఎలా వచ్చాయా తెలియని స్థితిలో ఆర్బీఐ ఉన్నపుడు కేంద్రప్రభుత్వ నల్లధన నిర్మూలన ఏ రీతిలో సాగుతోందో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. శేఖర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమార్జనలపై జరిపిన ఐటీ దాడులపై వెంటనే చర్య తీసుకునేలా నల్లధన నిర్మూలనం రోజున కేంద్రం ఒక ప్రకటన చేయాలని ఆయన కోరారు. అలాగే, శేఖర్‌రెడ్డికి రూ.2000 కొత్త నోట్లు ఎలా వచ్చాయనే వివరాలను ఆర్బీఐ అధికారులు వెంటనే సీబీఐకి అందజేసి చార్జీషీటు దాఖలుకు సహకరించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. -
పన్నీర్ మనిషా.. పక్కనపెట్టు
రాష్ట్ర రాజకీయాలు ఉరుము ఉరిమి మంగళం మీద పడింది అనే సామెతను తలపిస్తున్నాయి. అన్నాడీఎంకేలో ఏర్పడిన చీలికలు, అధికార మార్పిడితో నెలకొన్న పరిస్థితులు ఏ సంబం ధం లేని భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పన్నీర్‌సెల్వం మనిషి అనే కారణంతో కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డికి చెందిన 25 క్వారీలను మూసివేయించడం ద్వారా భవన నిర్మాణ రంగానికి సీఎం ఎడపాడి పళనిస్వామి షాక్ ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, చెన్నైః క్వారీల కాంట్రాక్టర్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై గత ఏడాది ఆదా యపు పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. పెద్దఎత్తున పాత నగదు, బంగారు, కొత్త కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శేఖర్‌రెడ్డితో పాటూ ఆయన వ్యాపార భాగస్వాములను అరెస్ట్ చేసి పుళల్ జైల్లో పెట్టారు. రాష్ట్రంలో మొత్తం 30 క్వారీలు ఉండగా, వీటిల్లో 25 క్వారీలు శేఖర్‌రెడ్డి ఆధీనంలో ఉన్నాయి. అంటే దాదాపు 90 శాతానికి పైగా ఇసుక లావాదేవీలు శేఖర్‌రెడ్డి కనుసన్నల్లో సాగాల్సిందే. మళ్లీ తెరపైకి శేఖర్‌రెడ్డి అంశం తన వ్యాపార భాగస్వామ్యులతో కలిసి పుళల్ జైల్లో ఉంటూ అడపాదడపా బెయిల్ పిటిషన్‌తో కోర్టుకు హాజరవుతున్నపుడు మినహా శేఖర్‌రెడ్డి పేరు దాదాపు తెరమరుగైంది. జయ మరణంతో అధికార అన్నాడీఎంకే శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలుగాచీలిపోవడం, పన్నీర్‌సెల్వం స్థానంలో ఎడపాడి పళనిస్వామి సీఎం కావడంతో అన్యాపదేశంగా శేఖర్‌రెడ్డి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలోని జయ ప్రభుత్వం మొత్తం 30 క్వారీలకు లైసెన్సు జారీ చేసి ఉండగా వీటిల్లో 25 క్వారీలను శేఖర్‌రెడ్డికి కట్టబెట్టారు. ఒక యూనిట్ ఇసుక రూ.800లుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయించిన ధర కంటే అనేక రెట్లు ఎక్కువగా వసూళ్లు సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పొల్లాచ్చీలో ఒక లోడు ఇసుక రూ.18 వేలు కాగా, మదురైలో రూ.13 వేలు, నామక్కల్‌లో రూ.12,500లు, తెన్‌కాశీలో రూ.29 వేలు లెక్కన ఇష్టారాజ్యంగా అమ్మసాగారు. ఇసుక క్వారీలకు సంబంధించి పెద్దఎత్తున సాగుతున్న ఆర్థికలావాదేవీల్లోనే శేఖర్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడినట్లు చెబుతారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కీలకమైన ఇసుక క్వారీలు శేఖర్‌రెడ్డి చేతిలో ఉన్న సంగతిని ఎడపాడి ప్రభుత్వం ఇటీవల పరిశీలనలోకి తీసుకుంది. సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా, శశికళపై తిరుగుబాటు తదనంతర పరిణామాలతో ఎడపాడి సీఎం అయ్యారు. సీఎంగా ఎడపాడి బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే శేఖర్‌రెడ్డికి స్వాధీనంలోని 25 ఇసుక క్వారీలను మూసివేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని నిర్మాణ రంగానికి మొత్తం 30 క్వారీల నుంచి ఇసుక సరఫరా సాగుతుండగా ప్రస్తుతం ఐదు క్వారీలకే పరిమితమైంది. కుంటువడిన నిర్మాణ రంగం.. చెన్నై భవన నిర్మాణ రంగ ఇంజినీర్ల సంఘం మేనేజర్ వెంకటాచలం సోమవారం మాట్లాడుతూ, గత నెలరోజులుగా రాష్ట్రంలోని తిరుచ్చి, ఆర్కాడు తదితర జిల్లాల్లోని ఐదు క్వారీల నుంచి అతికష్టం మీద తమకు ఇసుక అందుతోందని తెలిపారు. డిమాండ్‌కు సరఫరాకు మ ధ్య వ్యత్యాసం ఎక్కువ కావడంతో భవన నిర్మాణ రంగం పూర్తిగా కుంటుపడిపోగా కార్మికులకు పనుల్లేక ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూతపడిన 25 క్వారీలను పునరుద్ధరించడం ద్వారా భవన నిర్మాణరంగాన్ని కాపాడాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. -
తమిళ సీఎం ఎక్కువ కాలం కొనసాగరు!
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ విధేయుడు, తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన కె.పళనిస్వామి ఎంతో కాలం పదవిలో కొనసాగరని కేంద్ర మంత్రి పోన్ రాధాక్రిష్ణన్ అన్నారు. సొంతింట్లో మన కుర్చీలో కూర్చోవడం.. అద్దె కుర్చీలో కూర్చోవడం రెండు ఒకటి కాదంటూ పళనిస్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే తమిళనాడు కొత్త సీఎం కె.పళనిస్వామి అద్దె కుర్చీ (వేరొకరి స్థానం)లో ఉన్నారని తాను భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. విశ్వాసపరీక్షలో పళనిస్వామి నెగ్గడంపై మంత్రి రాధాక్రిష్ణన్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'అసెంబ్లీలో విశ్వాసపరీక్ష జరిగిన తీరు నిజంగా సిగ్గుచేటు. ప్రతిపక్షాలు లేకుండానే స్పీకర్ ధన్ పాల్ బలపరీక్ష నిర్వహించడం దారుణం. ఈ ఘటనతో రాష్ట్రమంతా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. బలనిరూపణ సమయంలో ప్రతిపక్ష డీఎంకే నేతలపై దాడి విషయంపై ఎంక్వరీ కమిషన్ వేయాలని' ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ ఎల్.గణేషన్ మాట్లాడుతూ.. పళనిస్వామి అంకెల్లో మాత్రమే మెజార్టీ నిరూపించుకున్నా.. నైతికంగా ఆయన ఓడిపోయారని చెప్పారు. అన్నాడీఎంకే నేతలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి అవకాశం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. -
పళనిస్వామికి వ్యతిరేకంగా ‘ఓటు’
-
పళనిస్వామికి వ్యతిరేకంగా ‘ఓటు’
- డీఎంకే నిర్ణయం - పరిస్థితిని బట్టి అడుగులు: స్టాలిన్ సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పడుతున్న అష్టకష్టాలను పరిగణలోకి తీసుకుని బలనిరూపణలో సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి డీఎంకే శాసనసభాపక్షం నిర్ణయించింది. పరిస్థితిని బట్టి తమ అడుగులు ఉంటాయని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ పరిణామాల్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు స్టాలిన్ తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని కూల్చడమా, పరిస్థితిని బట్టి అధికార పావులు కదపడమా, లేదా మళ్లీ ఎన్నికలకు వెళ్లడమా అన్న వ్యూహాలతో స్టాలిన్ అడుగులు సాగుతున్నాయి. శాసనసభలో శనివారం బల పరీక్ష సాగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆగమేఘాలపై ఎమ్మెల్యేలను చెన్నైకు పిలిపించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి గంటపాటు జరిగిన సమావేశంలో పళనిస్వామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం లక్ష్యంగా చర్చించారు. సందర్భాన్ని బట్టి తాను, ఉపనేత, విప్ సూచించే మేరకు నడుచుకోవాలని ఎమ్మెల్యేలకు స్టాలిన్ సూచించినట్లు సమాచారం. దీంతో శనివారం స్టాలిన్ ఎత్తులెలా ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది. మనమూ క్యాంప్ పెడుదామన్నట్టు పలువురు ఎమ్మెల్యేలు చమత్కరించగా, అందుకు సమయం వస్తుందేమో చూద్దామని స్టాలిన్ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. వ్యతిరేకంగా ఓటు అన్నాడీఎంకే వైఫల్యాలతో రాష్ట్రంలో ప్రజల్ని అష్టకష్టాలకు గురి చేసిందని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ... తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని, తమిళ ప్రజల జీవనాధారం మీద తీవ్ర ప్రభావం పడే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అన్నాడీఎంకే పాలకుల వైఖరిని నిరసిస్తూ, సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి నిర్ణయించా మని ప్రకటించారు. రహస్య ఓటింగ్‌కు అవకాశం దక్కితే ఆహ్వానిస్తామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తదుపరి అడుగులు ఎలా ఉంటాయి... పళనిస్వామి నెగ్గేనా అన్న ప్రశ్నలకు సమాధామిస్తూ... ‘వెయిట్ అండ్ సీ, ఒక్క రోజేగా’ అని ముగించారు.