పళనిస్వామికి వ్యతిరేకంగా ‘ఓటు’
- డీఎంకే నిర్ణయం
- పరిస్థితిని బట్టి అడుగులు: స్టాలిన్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పడుతున్న అష్టకష్టాలను పరిగణలోకి తీసుకుని బలనిరూపణలో సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి డీఎంకే శాసనసభాపక్షం నిర్ణయించింది. పరిస్థితిని బట్టి తమ అడుగులు ఉంటాయని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ పరిణామాల్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు స్టాలిన్ తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని కూల్చడమా, పరిస్థితిని బట్టి అధికార పావులు కదపడమా, లేదా మళ్లీ ఎన్నికలకు వెళ్లడమా అన్న వ్యూహాలతో స్టాలిన్ అడుగులు సాగుతున్నాయి.
శాసనసభలో శనివారం బల పరీక్ష సాగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆగమేఘాలపై ఎమ్మెల్యేలను చెన్నైకు పిలిపించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి గంటపాటు జరిగిన సమావేశంలో పళనిస్వామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం లక్ష్యంగా చర్చించారు. సందర్భాన్ని బట్టి తాను, ఉపనేత, విప్ సూచించే మేరకు నడుచుకోవాలని ఎమ్మెల్యేలకు స్టాలిన్ సూచించినట్లు సమాచారం. దీంతో శనివారం స్టాలిన్ ఎత్తులెలా ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది. మనమూ క్యాంప్ పెడుదామన్నట్టు పలువురు ఎమ్మెల్యేలు చమత్కరించగా, అందుకు సమయం వస్తుందేమో చూద్దామని స్టాలిన్ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.
వ్యతిరేకంగా ఓటు
అన్నాడీఎంకే వైఫల్యాలతో రాష్ట్రంలో ప్రజల్ని అష్టకష్టాలకు గురి చేసిందని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ... తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని, తమిళ ప్రజల జీవనాధారం మీద తీవ్ర ప్రభావం పడే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అన్నాడీఎంకే పాలకుల వైఖరిని నిరసిస్తూ, సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి నిర్ణయించా మని ప్రకటించారు. రహస్య ఓటింగ్‌కు అవకాశం దక్కితే ఆహ్వానిస్తామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తదుపరి అడుగులు ఎలా ఉంటాయి... పళనిస్వామి నెగ్గేనా అన్న ప్రశ్నలకు సమాధామిస్తూ... ‘వెయిట్ అండ్ సీ, ఒక్క రోజేగా’ అని ముగించారు.